పాక్ - సౌదీ తాజా బంధం.. మనకు కాస్త చికాకు పెట్టించేదే
దాయాది పాకిస్థాన్ - సౌదీ అరేబియాల మధ్య తాజాగా జరిగిన ఒక రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్యం.. దక్షిణాసియాల్లో మారనున్న సమీకరణాలకు వేదిక మారుతుందని చెప్పాలి.
By: Garuda Media | 19 Sept 2025 10:45 AM ISTదాయాది పాకిస్థాన్ - సౌదీ అరేబియాల మధ్య తాజాగా జరిగిన ఒక రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్యం.. దక్షిణాసియాల్లో మారనున్న సమీకరణాలకు వేదిక మారుతుందని చెప్పాలి. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ల మధ్య ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులోని కొన్ని అంశాలు అత్యంత కీలకంగా మారాయి. ఇది నాటో కూటమి నిబంధనల్లోని ఆర్టికల్ 5 లాంటిదే.
ఈ రక్షణ ఒప్పందంలో భారత్ ను చికాకు పెట్టించే అంశం ఒకటి ఉంది. అదేమంటే.. ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఎవరు దాడికి దిగినా ఆ రెండు దేశాలపై దాడికి పాల్పడినట్లుగా భావిస్తాయి. అంటే.. సౌదీపై ఏ దేశమైనా దాడికి తెగబడితే.. పాకిస్థాన్ మీదకు దండెత్తినట్లుగా భావిస్తారు. అదే సమయంలో పాకిస్థాన్ మీద ఏ దేశమైనాదాడికి దిగితే సౌదీపైనా యుద్ధాన్ని ప్రకటించినట్లే అవుతుంది. ఈ మధ్యన జరిగి ఆపరేషన్ సిందూర్ లాంటిదే జరిగితే.. పాక్ తోనే కాదు.. సౌదీతోనూ పంచాయితీ మొదలైనట్లుగా అవుతుంది.
ఇరాన్ - సౌదీ మధ్య ఉన్న శత్రుత్వం కూడా తెలిసిందే. భారత్ - పాక్ మధ్య ఉన్న చారిత్రక శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూస్తే.. తాజా డీల్ అటు మధ్యప్రాచ్యంలోనూ.. ఇటు సౌత్ ఏషియాలోని మిలిటరీ సమీకరణాలపై ప్రభావాన్ని చూపించే వీలుంది. తాజా ఒప్పందంలో నిఘా సమాచారం పంచుకోవటం.. సైబర్ సెక్యూరిటీ పరంగా సహకారం.. సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ లాంటి అంశాలు కూడా ఉన్నాయి.
ఈ ఒప్పందంతో సౌదీ ఇకపై అమెరికా మీద ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా ఇరాన్ నుంచి ఏదైనా ముప్పు వాటిల్లిన పరిస్థితుల్లో అమెరికాయుద్ధ నౌకల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా.. తన చేతిలో పాక్ అనే ఒకఆయుధాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నంగా దీన్ని చెప్పొచ్చు. తాజా ఒప్పందం ట్రంప్ ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. ఇటీవల కాలంలో అగ్రరాజ్యం పాక్ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న వేళ.. ఇప్పుడు ఆ దేశం సౌదీతో చేసుకున్న డీల్ చూసినప్పుడు ఆ దేశం అమెరికాకు ప్రాధాన్యత తగ్గించేలా ఉందని చెప్పాలి.
పాకిస్థాన్ కు సౌదీకి మధ్య సత్ సంబంధాలు దశాబ్దాల తరబడి సాగుతున్నదే. తాజా ఒప్పందం పాక్ కంటే కూడా సౌదీకే ప్రయోజనం కలిగించేలా చెప్పాలి. ఎందుకంటే తన సంపదతో పాక్ ను తన నియంత్రణలో ఉంచుకునే విషయంలో సౌదీ కాస్తంత తెలివిగా వ్యవహరించింది. అదే సమయంలో అమెరికా సైతం ఇప్పటికిప్పుడు సౌదీని ఏమీ అనలేని పరిస్థితి. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్ వేళ.. పాక్ తన వైమానిక దళానికి చెందిన బలహీనల్ని భారీగా గుర్తించింది. తాజా డీల్ తో పాక్ కు సౌదీ నుంచి వైమానిక దళానికి చెందిన సాంకేతికత అందుతుంది. మొత్తంగా చూసినప్పుడు.. ఈ డీల్ భారత్ కు చికాకు పెట్టేదిగా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు. తనతో స్నేహంగా ఉండే రెండు దేశాలు.. తన ప్రాధాన్యత తగ్గేలా వ్యవహరించిన వైనంపై అమెరికా ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పాలి.
