Begin typing your search above and press return to search.

పరువు పాయే.. ఇదే పాకిస్తాన్ ప్రధాని తగ్గించుకుంటే మంచిది..

రాజకీయాల్లో శత్రువులను దౌత్యపరంగా ఎదుర్కొంటారు.. విదేశాంగ విధానాలతో దెబ్బకొడతారు

By:  A.N.Kumar   |   2 Sept 2026 9:00 PM IST
పరువు పాయే.. ఇదే పాకిస్తాన్ ప్రధాని తగ్గించుకుంటే మంచిది..
X

రాజకీయాల్లో శత్రువులను దౌత్యపరంగా ఎదుర్కొంటారు.. విదేశాంగ విధానాలతో దెబ్బకొడతారు. కానీ పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మాత్రం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అదే 'ఫోటోషాప్ మార్గం'. బిష్కెక్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సీఓ) సదస్సు సందర్భంగా చోటుచేసుకున్న ఈ 'క్రోపింగ్' భాగోతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.

అసలు కథేంటంటే?

సదస్సు ముగిసిన తర్వాత సాంప్రదాయబద్ధంగా దేశాధినేతలంతా కలిసి ఒక 'గ్రూప్ ఫొటో' దిగారు. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా మొత్తం 12 మంది ప్రపంచ నేతలు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రపంచమంతా చూసింది, భారత్ పీఎంవో కూడా అధికారికంగా ఆ పిక్‌ను షేర్ చేసింది.

అయితే పాకిస్థాన్ పీఎంఓ ‘ఎక్స్’ ఖాతాను నడిపే మహాత్ములకు ఏమనిపించిందో ఏమో గానీ, ఆ ఫొటోను చక్కగా అటు ఇటూ కత్తిరించి కేవలం ఆరుగురు నేతలు మాత్రమే ఉండేలా ఒక 'మినిమలిస్ట్' పిక్‌ను పోస్ట్ చేశారు. యాదృచ్ఛికమో ఏమో కానీ ఆ కత్తిరింపుల్లో భారత ప్రధాని మోదీతో పాటు మరికొందరు నేతలు గాల్లో కలిసిపోయారు!

ఫోటోషాప్‌తో వైరం ముగుస్తుందా?

పోస్ట్ పడిన మరుక్షణమే నెటిజన్లు రంగంలోకి దిగారు. భారత్ పీఎంవో పెట్టిన ఒరిజినల్ ఫొటోను, పాక్ పీఎంవో పెట్టిన 'ఎడిటెడ్' వర్షన్‌ను పక్కపక్కన పెట్టి మీమ్స్ వర్షం కురిపించారు. "భారత్‌ను ఎదగకుండా ఆపలేకపోయాం.. కనీసం ఫొటోలోనైనా మోదీని తీసేద్దాం" అని పాక్ పీఎంవో అనుకుందేమో అని నెటిజన్లు దారుణంగా సెటైర్లు వేశారు. దౌత్య సంబంధాలను పక్కనబెట్టి ఫొటోగ్రాఫ్ ఎడిటింగ్‌తో పగ తీర్చుకోవడం ఒక్క పాకిస్థాన్‌కే సాధ్యమంటూ కామెంట్ల వర్షం కురిసింది.

తప్పు తెలుసుకొని... మళ్లీ రీ-పోస్ట్

వివాదం ముదిరి పాకాన పడటంతో చేసిన పనికి నవ్వులపాలయ్యామని గ్రహించిన పాక్ పీఎంవో సిబ్బంది కొన్ని గంటల తర్వాత సైలెంట్‌గా మోదీ స్పష్టంగా కనిపిస్తున్న మరో ఫొటోను షేర్ చేసి కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

ఇక ఇదే సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ చిరునవ్వుతో ముచ్చటించడం.. మరోవైపు షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో 'సింధు జలాల ఒప్పందం' అంటూ పాత పాట పాడటం లాంటివన్నీ పక్కన పెడితే.. ఈ "ఫొటో కట్-పేస్ట్" డ్రామానే సదస్సుకే హైలైట్‌గా నిలిచింది. సమస్యలను పరిష్కరించుకోవడానికి డిప్లమసీ వాడాలి గానీ, ఇలా ఫోటోషాప్ కత్తెర వాడితే ప్రపంచం ముందు నవ్వులపాలు కాక తప్పదని పాక్ పీఎంవో ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది!