Begin typing your search above and press return to search.

మునీర్ తో పాటు ముసుగేసుకుని పాక్ పీఎం భిక్షాటన... వీడియో వైరల్!

శుక్రవారం ఇస్లామాబాద్ లో జరిగిన ఓ వ్యాపార సంఘ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని షరీఫ్... పాకిస్థాన్ లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యల వల్ల ప్రభుత్వం అప్పులు కోరవలసి వచ్చిందని అంగీకరించారు.

By:  Raja Ch   |   31 Jan 2026 2:24 PM IST
మునీర్  తో పాటు ముసుగేసుకుని పాక్  పీఎం భిక్షాటన... వీడియో వైరల్!
X

పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. చాలా కాలంగా పాక్ ఆర్థిక పరిస్థితి తిరోగమణంలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో పాటు మిత్ర దేశాలవైపు అప్పుల కోసం పరుగులు పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మునీర్ తో కలిసి తాను రహస్యంగా మిత్ర దేశాల వద్ద భిక్షాటన చేసినట్లు పాకిస్థాన్ ప్రధాని వెల్లడించారు! ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తో కలిసి మా స్నేహపూర్వక దేశాలను సంప్రదించిన, ఆర్థికంగా సహాయం చేయమని వారిని అభ్యర్థించినప్పుడు.. వారు మమ్మల్ని నిరాశపరచలేదు అంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆన్ లైన్ లో వేగంగా వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో... ఇలా మిత్రదేశాల వద్దకు వెళ్లి ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకుంటూ, అప్పులు అడగడం చాలా సిగ్గుగా అనిపించిందని.. ఇది జాతీయ ఆత్మగౌరవాన్ని తగ్గించడమే అని అన్నారు.

శుక్రవారం ఇస్లామాబాద్ లో జరిగిన ఓ వ్యాపార సంఘ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని షరీఫ్... పాకిస్థాన్ లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యల వల్ల ప్రభుత్వం అప్పులు కోరవలసి వచ్చిందని అంగీకరించారు. ఇలా తాము రహస్యంగా మిత్రదేశాల వద్దకు వెళ్లి అప్పులు అడగడం చాలా అంబారసింగ్ గా అనిపించిందని.. ఈ సమయంలో అప్పులు ఇచ్చేవారు ఏమి డిమాండ్ చేసినా కాదనలేని పరిస్థితి ఉంటుందని.. ఇది చాలా ఇబ్బందికర పరిణామమని అన్నారు.

ఈ సమయంలో పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన చైనా, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వంటి మిత్రదేశాలన్నింటికీ ఈ సందర్భంగా షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రధానంగా తమకు ఆర్థిక సాయం అందించిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఇదే సమయంలో... పెరుగుతున్న నిరుద్యోగం, అంచనాల కంటే నెమ్మదిగా ఎగుమతి వృద్ధి వంటి సవాళ్లు కొనసాగుతున్నాయని ప్రధాని షరీఫ్ అంగీకరించారు. ఇదే క్రమంలో... ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టడానికి, అనవసరపు ఖర్చులను తగ్గించడానికి కృషి చేస్తోందని తెలిపారు.

కాగా... రోజు రోజుకీ పెరుగుతున్న అప్పులు, వాటి వడ్డీలతో పాటు మందగిస్తున్న వృద్ధి వెరసి.. దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని సృష్టిసున్నాయని నిపుణులు చెబుతున్నారు! మరోవైపు షరీఫ్ వ్యాఖ్యలపై రాజకీయ ప్రత్యర్థులతో సహా స్వదేశంలోని విమర్శకులు తీవ్రంగా స్పందిసున్నారు. ఈ వ్యాఖ్యలను ప్రపంచ వేదికపై ప్రభుత్వం బలహీనమైన చర్చల స్థానంతో పాటు దౌత్య పరమైన చేరికల కోసం సైనిక మద్దతుపై ఆధారపడానికి రుజువుగా చెబుతున్నారు. అదేవిధంగా... బాహ్య రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని సూచిస్తున్నారు!