మానవ అవయవాల అక్రమ వ్యాపారం.. ప్లాసెంటా స్మగ్లింగ్ కేసు సంచలనం!
అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలు కేవలం డ్రగ్స్, బంగారం మాత్రమే కాదు.. ఏకంగా మానవ అవయవాలను కూడా అక్రమంగా రవాణా చేస్తున్నాయనే షాకింగ్ నిజం ఇప్పుడు బయటపడింది.
By: Madhu Reddy | 2 July 2026 3:00 PM ISTఅంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలు కేవలం డ్రగ్స్, బంగారం మాత్రమే కాదు.. ఏకంగా మానవ అవయవాలను కూడా అక్రమంగా రవాణా చేస్తున్నాయనే షాకింగ్ నిజం ఇప్పుడు బయటపడింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో విస్తుపోయే రేంజ్‌లో సాగుతున్న ఒక అంతర్జాతీయ ప్లాసెంటా రాకెట్ గుట్టును అక్కడి అధికారులు రట్టు చేశారు. వైద్య చరిత్రలోనే ఇలాంటి ఒక అవయవాల అక్రమ రవాణా దందా బయటపడటం ఇదే మొదటిసారి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త పెద్ద సంచలనం సృష్టిస్తోంది.
గొర్రె మాంసం పేరుతో మోసం చేసిన విషయం, పాకిస్తాన్‌కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఏకంగా 500 కేజీల బరువున్న మానవ ప్లాసెంటాను అంటే రక్తపిండం లేదా మాయ అంటారు ఒక చోట సేకరించింది. అయితే విదేశాలకు తరలించేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. అది గొర్రెల ప్లాసెంటా అని నమ్మిస్తూ పేపర్లు సృష్టించి బోర్డర్ దాటించడానికి ప్లాన్ చేశారు. అయితే అధికారులు ముందుగానే ప్లాన్ చేసి, ఈ ముఠాను అక్కడికక్కడే పట్టేశారు.
ఆసుపత్రుల నుండి తక్కువ ధరకు కొనుగోలు:
ఈ ముఠాకు స్థానిక ఆసుపత్రుల్లోని కొందరు సిబ్బందితో లింకులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పారేసే ప్లాసెంటాను ఈ కేటుగాళ్లు ఆసుపత్రుల నుండి చాలా తక్కువ ధరకు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసేవారు. ఇక అలా సిటీలోని రకరకాల హాస్పిటల్స్ నుండి వందల కేజీల ప్లాసెంటాను సేకరించి, కోల్డ్ స్టోరేజ్‌లలో దాచి ఉంచి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మెడిసిన్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం వాడకం:
అసలు ఈ మానవ ప్లాసెంటాను విదేశాలకు ఎందుకు పంపుతున్నారనే దానికి షాకింగ్ కారణాలు తెలిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఉందట. ఇక ముఖ్యంగా కొన్ని రకాల ఖరీదైన ఔషధాల తయారీలోనూ, అలాగే యాంటీ ఏజింగ్ సౌందర్య సాధనాలు, కాస్మోటిక్స్ తయారీలో ఈ మానవ ప్లాసెంటాను విరివిగా వాడుతున్నట్లు విచారణలో తేలింది.
చైనాలో వండుకుని తింటున్నారు:
ఈ దర్యాప్తులో అన్నింటికంటే దారుణమైన విషయం మరొకటి బయటపడింది. ఈ ప్లాసెంటాను ఎక్కువగా చైనా వంటి దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. చైనాలోని కొందరు సంపన్న వర్గాల వారు ఈ మానవ ప్లాసెంటా తింటే ఆరోగ్యం, యవ్వనం లభిస్తాయని నమ్ముతూ.. దీనిని ప్రత్యేకంగా వండుకుని తింటున్నారనే చేదు నిజం తెలిసి అధికారులు సైతం ముక్కున వేలేసుకున్నారు.
డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారనే దానికి ఈ ప్లాసెంటా స్మగ్లింగ్ కేసే పెద్ద ఉదాహరణ. హాస్పిటల్స్ లో వేస్ట్ గా పారేసే భాగాలను కూడా ఇలా కోట్లలో బిజినెస్ చేయడానికి వాడుకోవడం నిజంగా ఘోరం. ఇక ఈ కేసు తర్వాతైనా అన్ని దేశాల ప్రభుత్వాలు ఆసుపత్రుల వేస్ట్ మేనేజ్మెంట్ పై నిఘా పెంచాలని, ఇలాంటి ముఠాలకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
