పాక్ అధ్యక్షుడికి బంకర్ చూపించిన సింధూర్
అది కదా సత్తా అంటే. పహల్గాం ఉగ్ర దాడికి సరైన జవాబు అంటే అది కదా అని అంటున్నారు.
By: Satya P | 29 Dec 2025 9:14 AM ISTఅది కదా సత్తా అంటే. పహల్గాం ఉగ్ర దాడికి సరైన జవాబు అంటే అది కదా అని అంటున్నారు. పర్యాటకులుగా కాశ్మీర్ వచ్చిన అమాయకులు అయిన ఇరవై ఆరు మందికి మతం పేరు అడిగి మరీ దారుణంగా కాల్చి చంపడమే కాదు, మీ మోడీకి పోయి చెప్పుకో అని బరితెగించి ఉగ్రవాదులు హూంకరించారు. దానికి జవాబు మోడీ మూడు వారాలు కూడా గడవకముందే ఇచ్చి మరీ పీచమణచారు. దాని పేరే ఆపరేషన్ సింధూర్. దెబ్బకు దెబ్బ కాదు దిమ్మదిరిగేలా ఇచ్చిన దెబ్బ. దీనికి పెడబొబ్బలు పెట్టడం పాక్ వంతు అయింది. ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడు నెలలు అయినా పాక్ కి ఇంకా చీకటి కలలు వస్తున్నాయంటే భారత్ పవర్ ఏంటో బాగా అర్ధం అయినట్లే అంటున్నారు.
బెంబేలెత్తిన వైనం :
దాయాది పాక్ కి ఆపరేషన్ సింధూర్ తో బెంబేలెత్తిన పరిస్థితి ఏర్పడింది. భారత్ నుంచి వెల్లువలా క్షిపణులు వచ్చి పడుతూంటే లక్ష్యాలను కచ్చితంగా గురి పెట్టి చీల్చిచెండాడుతూంటే ఏమి చేయాలో తెలియక బిత్తరపోవడం తప్ప పాక్ ఏమీ చేయలకపోయింది. అటువంటి నిస్సహాయ స్థితిలోనే కాళ్ళ బేరానికి వచ్చి మరీ కాల్పుల విరమణకు సిద్ధపడింది. ఇక ఆ సమయంలో పాక్ పాలకుల మనోభావాలు ఎలా ఉన్నాయో అందరికీ ఎరుకే. కానీ పైకి మాత్రం బీరాలు పలుకుతూ లేస్తే మనిషి కాను అన్నట్లుగా ప్రకటనలు చేస్తూ నిన్నటి దాకా కాలం వెళ్ళబుచ్చుతూనే ఉన్నారు. అంతే కాదు ఈసారి రండి మేమేంటో చూపిస్తామని ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలుకుతున్నారు.
అందరినీ కలుపుకుంటూ :
ఆపరేషన్ సింధూర్ దెబ్బకు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుని బతుకు జీవుడా అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పాక్ మరో వైపు బంగ్లా దేశ్ ని మచ్చిక చేసుకుంటూ భారత్ ని ఏదో చేసేయాలని తెగ ఆరాటపడుతున్న వేళ ఒక పచ్చి నిజం బయటకు వచ్చింది. దాంతో పాక్ కి ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఎంత గట్టిగా తగిలింది. ఎంతలా చిత్తు అయింది మొత్తం అంతర్జాతీయ సమాజానికి పూర్తిగా తేటతెల్లమైంది.
బంకర్ లోకి వెళ్ళమన్నారు :
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ క్షిపణుల దాడితో ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో పాక్ పాలకులు మొత్తం బిక్కుబిక్కుమంటూ గడిపారు అని వార్తలు వచ్చాయి. అదే నిజం అన్నట్లుగా తాజాగా పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అంగీకరినారు. ఆపరేషన్ సింధూర్ కి పాక్ అగ్రనాయకత్వం భయాందోళనలకు గురి అయింది అని ఆయన అంగీకరించటం విశేషం. ఆ సమయంలో తనను ప్రాణ రక్షణ కోసం బంకర్ లోకి వెళ్ళాలని సైనిక కార్యదర్శి సూచించారు అని జర్దారీ చెప్పడం కీలక పరిణామం.
అంతా బంకర్లలోకే :
అయితే దానికి తాను అంగీకరించలేదు అని ఆయన చెప్పినప్పటికీ మరో రోజు కనుక ఆపరేషన్ సింధూర్ కొనసాగి ఉంటే ఆయనతో పాటు మొత్తం పాక్ అగ్ర నాయకత్వం అంతా బంకర్లలోకే వెళ్ళాల్సి వచ్చేది అన్నది ఈ మాటలను బట్టి అర్ధం అవుతోంది. మొత్తానికి భారత్ ప్రయోగించిన ఆపరేషన్ సింధూర్ పాక్ గుండెలను ఎంతలా దడదడలాడించిందో ఎంతలా వారిని వణికించిందో జర్దారీ మాటలే చెబుతున్నాయి. నిజంగా ఇంతలా వణికిన పాక్ మరోసారి భారత్ తో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దుస్సాహం అవుతుంది అని అంతా అనుకోవచ్చు. కానీ పాక్ బుద్ధి తెలిసిన వారు మాత్రం అలా అనుకోరు. దేశమంతా నాశనం అయినా భారత్ మీదనే కక్ష కట్టి కుయుక్తులకు తయార్ అంటూనే ఉంటుందని మాత్రం అంతా చెబుతారు.
