Begin typing your search above and press return to search.

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ ఢిల్లీకి వచ్చారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు నిబంధనల ప్రకారం సభ్య దేశాలన్నింటినీ ఆహ్వానించాల్సి ఉండటంతో ఆయన పర్యటనకు అవకాశం కలిగింది. అయితే తాజ్‌మహల్, నిజాముద్దీన్ దర్గాల సందర్శనకు భారత్ అనుమతి నిరాకరించి, ఆయన పర్యటనను సదస్సుకే పరిమితం చేసింది.

By:  Satya P   |   21 Nov 2026 9:02 AM IST
ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !
X

అసలు పాక్ కి భారత్ కి మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు 2025 ఏప్రిల్ లో పహిల్గాన్ ఉగ్ర దాడి తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది. పాక్ కి తన ప్లేస్ ఎక్కడో అలా చూపించేసింది. ఆ మీదట పాక్ కి భారత్ ఉదారంగా ఆరు దశాబ్దాలకు పైగా ఇస్తూ వస్తున్న సింధు నదీ జలాలను కూడా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రక్తం నీరు ఒకేసారి పారవని పాక్ ఉగ్ర వాదానికి స్వస్తి చెప్పినపుడు మాత్రమే నదీ జలాల ఒప్పందాన్ని తిరిగి పరిశీలిస్తామని భారత్ స్పష్టం చేసింది. ఇక పాక్ తో చర్చలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే ఆశ్చర్యకరంగా పాక్ మంత్రి ఢిల్లీ సమ్మిట్ కి వచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

ఆ నిబంధనల వల్లనే :

నిజానికి పాక్ మంత్రిని భారత్ తానుగా ఆహ్వానించలేదు. కేంద్రంలో బీజేపీ విధానం అలాగే ఉంది. కానీ ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ నాగరిక సంభాషణల వేదికలో పాల్గొనేందుకు పాకిస్తాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ భారత్‌కు వచ్చారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ బహుపాక్షిక అంతర్జాతీయ నిబంధనల కారణంగా ఈ పర్యటన సాధ్యమైంది అని దౌత్య నిపుణులు చెబుతున్నారు. షాంఘై సహకార సంస్థ నిబంధనల మేరకు ఆతిథ్య దేశంగా ఉన్న భారత్ అన్ని సభ్య దేశాలను ఆహ్వానించడం తప్పనిసరిగా ఉంది. ఇందులో భాగంగానే భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపిందని చెబుతున్నారు. నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని పురానా ఖిలాలో జరుగుతున్న ఈ మూడు రోజుల సదస్సులో అలా పాక్ మంత్రికి పాల్గొనే చాన్స్ దక్కింది.

చేతులు నరుకుతాం అన్న మాలిక్ :

ఇదిలా ఉంటే సింధూ జలాలను పాక్ కి వదలకపొతే భారత్‌ చేతులు నరుకుతామని అన్న పాక్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ ఈ సదస్సుకు రావడమే చిత్రాతిచిత్రం. భారత్ అయితే ఆయన్ని ఆహ్వానించలేదని అంటున్నారు. వాస్తవానికి భారత్ పాకిస్థాన్ జాతీయ వారసత్వ, సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీని ఈ సదస్సుకు ఆహ్వానించింది. కానీ,పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఆయనకు బదులుగా వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌ను నామినేట్ చేసి మరీ పంపింది. ఆయనను సభ్య దేశం తరఫున ప్రతినిధిగానే భారత్ చూస్తోంది. అంతకు మించి ఎలాంటి అదనపు వ్యవహారాలు లేవని అంటున్నారు.

తాజ్ మహల్ సందర్శనకు నో :

ఇదిలా ఉంటే ఢిల్లీకి మూడు రోజుల సదస్సు కోసం వచ్చిన పాక్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ తాజ్ మహల్ సందర్శనకు అనుమతి కోరారని అంటున్నారు. అలాగే ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గా సందర్శనకు సైతం అనుమతి కోరగా భారత ప్రభుత్వం నిరాకరించింది. ఆయన పర్యటన కేవలం కేవలం సదస్సు కే పరిమితం అని స్పష్టం చేసి మరీ షాక్ ఇచ్చింది. అంతే కాదు ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరగడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక చూస్తే 2023 మేలో గోవాలో జరిగిన ఎస్ సీఓ సమావేశానికి నాటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వచ్చిన తర్వాత ఒక పాక్ మంత్రి భారత్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. గతంలో సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముసాదిక్ మాలిక్‌ను భారత్‌కు అనుమతించడంపై ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇది కేవలం బహుపాక్షిక దౌత్య విధానం మాత్రమేనని విదేశాంగ శాఖ చెబుతోంది.