పాకిస్తాన్ సూపర్ రిచ్ దేశం కాబోతోందా?
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల జాబితాలోకి చేరగలదని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
By: A.N.Kumar | 15 Aug 2025 12:00 AM ISTప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల జాబితాలోకి చేరగలదని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ దేశ భూగర్భంలో దాగి ఉన్న అపారమైన ఖనిజ సంపద. అంచనాల ప్రకారం, పాకిస్తాన్‌లో సుమారు 3 నుండి 5 ట్రిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంపదను సరిగ్గా వినియోగించుకుంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా రూపురేఖలు మారగలదని విశ్లేషకులు చెబుతున్నారు.
- అపారమైన ఖనిజ నిక్షేపాలు
పాకిస్తాన్‌లో బొగ్గు, రాగి, బంగారం, ఇనుము, క్రోమైట్ వంటి ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు గనులు (ఖేవ్ర గనులు) , ఐదో అతిపెద్ద రాగి-బంగారం గనులు (రేకో డిక్) ఈ దేశంలోనే ఉన్నాయి. ఈ ఖనిజ సంపద బలూచిస్తాన్‌లోని ఎడారి ప్రాంతం నుండి పంజాబ్‌లోని సారవంతమైన భూముల వరకు విస్తరించి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ గనులపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల పాకిస్తాన్‌కి పెద్దగా లాభం చేకూరలేదు.
- పాలసీ మార్పులు - పెట్టుబడులు
ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఖనిజ గనుల నిర్వహణను ప్రాంతీయ ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావాలని.. విదేశీ పెట్టుబడులను సులభతరం చేయాలని నిర్ణయించింది. ఈ మార్పుల వల్ల బిడ్డింగ్‌లు, అనుమతులు.. భద్రతా క్లియరెన్స్‌లు వేగంగా పూర్తవుతాయి. ఇది విదేశీ సంస్థలను ఆకర్షించడానికి దోహదం చేస్తుంది.
- ప్రధాన పెట్టుబడిదారులు
చైనా గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో మైనింగ్ హక్కులను పొందడానికి ఆసక్తి చూపుతోంది. అమెరికా ఉత్తర బలూచిస్తాన్ , దక్షిణ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది. సౌదీ అరేబియా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రేకో డిక్ రాగి-బంగారం గనులపై పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. టర్కీ, యూఏఈ, యూకే ఈ దేశాలు కూడా పలు మైనింగ్ ప్రాజెక్టుల్లో ఆసక్తి చూపుతున్నాయి.
- భవిష్యత్తు అవకాశాలు
ఈ గనులను సరిగ్గా అభివృద్ధి చేస్తే, పాకిస్తాన్ ఆర్థికంగా పుంజుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎగుమతుల ద్వారా భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించవచ్చు. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టులు దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) ని అనూహ్యంగా పెంచగలవు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కి ఈ ఖనిజ సంపద ఒక 'బంగారు టికెట్' లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని విజయవంతంగా వినియోగించుకోవాలంటే, పారదర్శక విధానాలు, రాజకీయ స్థిరత్వం మరియు సురక్షితమైన వాతావరణం అవసరం. ఈ అంశాలన్నీ సవ్యంగా నడిస్తే, పాకిస్తాన్ సంక్షోభం నుంచి సంపద వైపు దూసుకుపోయే అవకాశం ఉంది.
