బంగ్లాలో ఉద్రిక్తతల వేళ భారత్ కు పాక్ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్!
అవును... బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక వాయిస్ పెరుగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేడెక్కుతున్నాయనే కథనాల నడుమ పాకిస్థాన్ నుంచి భారత్ కు హెచ్చరికలు వచ్చాయి.
By: Raja Ch | 23 Dec 2025 11:37 PM ISTబంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక వాక్ చాతుర్యం రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ అస్థిరతకు కారణమైతే, సెవన్ సిస్టర్స్ ను కట్ చేసే అవకాశం ఉందంటూ నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు హస్నత్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. స్వాతంత్ర్యం వచ్చిన 54 సంవత్సరాల తర్వాత కూడా బంగ్లాదేశ్ తనపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్న రాబందుల ప్రయత్నాలను ఎదుర్కొంటూనే ఉందని తెలిపారు.
మరోవైపు బంగ్లాదేశ్ లో రోజు రోజుకీ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల 25 ఏళ్ల హిందూ వ్యక్తి దీపూ చంద్రదాస్ దారుణ హత్య ఇందుకు బలమైన ఉదాహరణ. మరోవైపు ఇరు దేశాల్లోని దౌత్య కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. వీసా కార్యాలయాల మూసివేతలు.. వెరసి భారత్ – బంగ్లాదేశ్ ల మధ్య వాతావరణం వేడెక్కుందనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఇదే అదనుగా వాయిస్ పెంచుతున్న పాకిస్థాన్.. భారత్ కు వార్నింగ్ ఇచ్చింది!
అవును... బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక వాయిస్ పెరుగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేడెక్కుతున్నాయనే కథనాల నడుమ పాకిస్థాన్ నుంచి భారత్ కు హెచ్చరికలు వచ్చాయి. ఇందులో భాగంగా.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీ.ఎం.ఎల్) యువజన విభాగం నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ భారతదేశానికి బెదిరింపులు జారీ చేశాడు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కు సమస్య వస్తే పాక్ చూస్తూ ఊరుకోదని చెప్పుకొచ్చాడు.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన కమ్రాన్ సయీద్ ఉస్మానీ... బంగ్లాదేశ్ స్వయంప్రతిపత్తిపై భారతదేశం దాడి చేస్తే.. ఎవరైనా బంగ్లాదేశ్ ను దురుద్దేశంతో చూడటానికి ధైర్యం చేస్తే.. పాకిస్థాన్ ప్రజలు, పాకిస్థాన్ సాయుధ దళాలు చూస్తూ ఊరుకోవని.. క్షిపణులు ఎంతో దూరంలో లేవనే విషయం గుర్తించుకోవాలని.. భారత్ తన "అఖండ భారత్ భావజాలం"ను బంగ్లాదేశ్ పై రుద్దే ప్రయత్నాలు చేస్తే పాకిస్థాన్ సహించదని హెచ్చరించారు.
ఇదే సమయంలో.. భారతదేశ సైద్ధాంతిక ఆధిపత్యంలోకి బంగ్లాను నెట్టడాన్ని హెచ్చరించిన ఉస్మానీ.. బంగ్లాదేశ్ పై భారత్ దాడి చేసినా.. లేక, దాని స్వయంప్రతిపత్తిపై దుష్ట దృష్టి పెట్టినా పాకిస్థాన్ బలంగా స్పందిస్తుందని హెచ్చరించాడు. ఈ సందర్భంగా... పాకిస్థాన్ గతంలో భారత్ ను క్లిష్టపరిస్థితుల్లో నెట్టిందని.. అవసరమైతే మళ్లీ అలా చేయగలదని ఉస్మానీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్ పై పాక్, బంగ్లా, చైనాలు ఎలా దాడి చేస్తాయో చెప్పుకొచ్చారు!
ఇందులో భాగంగా... పాకిస్థాన్ పశ్చిమం నుంచి, బంగ్లా తూర్పు నుంచి దాడి చేస్తుందని.. ఇక, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ పై చైనా దృష్టి సారించిందని ఉస్మానీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని.. బంగ్లాదేశ్ ను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కలవరపరుస్తోన్న వేళ ఇది అవసరమని అన్నారు.
