యూనిఫామ్ మార్చాం.. రూటు మార్చలేం.. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కొత్త ప్లాన్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు
సంస్థ మునిగిపోతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే.. తన 'స్టైల్' మాత్రం అస్సలు వదులుకోదు.. తీవ్ర ఆర్థిక సంక్షోభం.. నిర్వహణ లోపాలతో సతమతమవుతున్న ఈ సంస్థ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది
By: A.N.Kumar | 22 Sept 2026 1:00 AM ISTపాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) రూటే వేరు. సంస్థ మునిగిపోతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే.. తన 'స్టైల్' మాత్రం అస్సలు వదులుకోదు.. తీవ్ర ఆర్థిక సంక్షోభం.. నిర్వహణ లోపాలతో సతమతమవుతున్న ఈ సంస్థ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఏ విమానం లేట్ అయిందనో.. లేక సర్వీసులు ఆగిపోయాయనో అనుకుంటే పొరపాటే. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమ కేబిన్ క్రూ కోసం కొత్త యూనిఫామ్‌లను లాంచ్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.
దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి మరీ ఈ కొత్త డ్రెస్సులను ఆవిష్కరించారు. పురుష సిబ్బందికి సూటు-బూటు, మహిళా సిబ్బందికి డార్క్ గ్రీన్, సాఫ్ట్ గ్రే-బ్లూ రంగుల్లో కొత్త కోట్లు, క్యాప్‌లు, స్కార్ఫ్‌లు తగిలించారు. అబ్బా.. ఏం డిజైన్.. సిబ్బందికి 'ఆధునిక, ప్రొఫెషనల్ లుక్' తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమని సంస్థ గొప్పగా చెప్పుకొచ్చింది.
అయితే ఈ హంగామా చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. "విమానంలో ఎక్కడ చూసినా బొద్దింకలు తిరుగుతున్నాయి.. ముందు వాటిని బయటకు తోలండ్రా బాబు" అంటూ ప్రయాణికులు తీవ్ర స్థాయిలో కామెంట్లు పెడుతున్నారు. విమానాల్లో సీట్లు ఊడిపోతుంటే ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు పనిచేయక డమ్మీగా మిగిలిపోతుంటే టాయిలెట్లు శుభ్రంగా లేక ప్రయాణికులు నరకం చూస్తుంటే.. వీళ్లకు మాత్రం సిబ్బంది వేసుకునే బట్టల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు.
అసలు కథ వేరే ఉంది. పీఐఏ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులతో దివాళా తీసే స్థితికి చేరుకుంది. సంస్థను గట్టెక్కించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టి, ప్రైవేటీకరణ చేయడానికి కన్సార్టియంలను వెతుక్కుంటోంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రయాణికులకు ఇచ్చే ప్రాథమిక రాయితీలను కోత కోసి కీలకమైన రూట్లలో విమానాలను రద్దు చేసిన పీఐఏ యాజమాన్యం.. ఫ్యాషన్ షోలు నిర్వహించడం చూస్తుంటే నెటిజన్లకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.
రూపురేఖలు, బట్టలు మారిస్తే సరిపోదు.. ముందు విమానాల్లో సేవల నాణ్యత, పరిశుభ్రత, టైమింగ్స్ మార్చాలని ప్రయాణికులు హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనా సంస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు తీసుకోకుండా కేవలం యూనిఫామ్ మార్చి ఆధునికీకరణ అని రంగులు పూయడం పీఐఏకే చెల్లింది.
