Begin typing your search above and press return to search.

మా నాన్నను చంపేశారా..? ఉంటే ఆధారలేవీ?

తోషాఖానా కేసుకు సంబంధించి అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అటక్ జైలులో నిర్బంధించారు.

By:  Tupaki Political Desk   |   28 Nov 2025 11:26 AM IST
మా నాన్నను చంపేశారా..? ఉంటే ఆధారలేవీ?
X

మానాన్నను ఏం చేశారు? ఎవర్నీ కలవనీకుండా ఎందుకుంచారు? ఇంతకూ మానానన్నను ఉంచారా...చంపేశారా? ఒక వేళ బతికే ఉంటే నాకు ఇప్పుడే ఆధారాలు చూపండి ...ఇదీ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ ఆవేదన.

ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు వస్తున్న వార్తల్ని పాక్ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రి ఏమయ్యాడో కనీసం ఆచూకీ కూడా తెలపకుండా అమానవీయంగా నిర్బంధించారని అతను ఆరోపిస్తున్నారు.

తోషాఖానా కేసుకు సంబంధించి అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అటక్ జైలులో నిర్బంధించారు. అయితే రాజకీయ ఖైదీలకు ...అందులోనూ దేశ మాజీ ప్రధానికి కనీస వసతులు కూడా కల్పించకుండా చీకటి గదిలో పడేసినట్లు తెలుస్తోంది. ఏమాత్రం వెలుతురు లేని ఓ ఇరుకు గదిలో పురుగులు, ఈగలు ముసురుకుంటున్న పరిస్థితిలో నరక కూపంలో లాగా ఇమ్రాన్ మగ్గిపోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ములాఖాత్ లు మొత్తం బంద్ చేసి అతణ్ని ఏకాకిగా అంతమొందించే కుట్రలు కొనసాగుతున్నాయని ఇమ్రాన్ వర్గీయుల ప్రధాన ఆరోపణ. ఇమ్రాన్ కు కనీస సౌకర్యాలు కల్పించాలని పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

తన తండ్రిని 845 రోజుల నుంచి జైల్లోనే నిర్బంధించారని, కోర్టు ఉత్తర్వులున్నా కూడా కుటుంబసభ్యుల్ని కలవనీయడం లేదని, ఆయన ఆరోగ్య సమాచారం బైటికి రానీకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని ఖాసీం ఖాన్ అంటున్నారు. ఇదంతా చూస్తుంటే పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ను అంతం చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తమకు అనుమనాలు బలపడుతున్నాయని, తన తండ్రికి ఏం జరిగినా అందుకు పాక్ ప్రభుత్వం , అంతర్జాతీయంగానూ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఖాసీం ఖాన్ హెచ్చరించారు.

పాక్ మాజీ ప్రధాని సంపన్నకుటుంబంలో జన్మించారు. ఉన్నత చదువు, సమర్థ రాజకీయ ప్రస్థానంతో తిరుగులేని నేతగా ఎదిగారు. పాక్ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించి ఎందరో క్రికెట్ అభిమానుల గుండెల్లో చోటు సంపాయించుకున్న ఇమ్రాన్ ఖాన్ అధికారానంతరం ఇలా జైల్లో మగ్గిపోవడం విషాదం.