Begin typing your search above and press return to search.

భారత్ తో కయ్యానికి పోయి.. అమెరికా చేతిలో పాక్ బలి?

పాకిస్తాన్‌ ఇప్పటికే చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లో భాగంగా చైనా నిర్మించిన గ్వాదర్‌ పోర్టు ద్వారా చైనా ప్రభావంలోకి వెళ్లిపోయింది.

By:  Raja Ch   |   16 Oct 2025 6:00 AM IST
భారత్ తో కయ్యానికి పోయి.. అమెరికా చేతిలో పాక్ బలి?
X

భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలనే అహంకారపూరిత ప్రయత్నంలో పాకిస్తాన్ మరోసారి తన ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని పణంగా పెడుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. "కౌంటర్ పేరు చెప్పి కుంపటి పట్టుకున్న పాక్" అనే సామెతను నిజం చేస్తూ, గతంలో చైనా ట్రాప్‌లో చిక్కుకున్న పాక్ ఇప్పుడు అదే పొరపాటును అమెరికాతో పునరావృతం చేస్తోందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

* కొత్త పోర్టు, కొత్త బానిసత్వం?

ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్‌ పోర్టు విజయవంతం కావడం ఖాయమని గ్రహించిన పాకిస్తాన్, దానికి ప్రత్యామ్నాయంగా, భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలను అడ్డుకునే లక్ష్యంతో అమెరికాకు ఒక కీలకమైన డీల్‌ను ఆఫర్ చేసింది. పాకిస్తాన్‌లోని పాస్తీ ప్రాంతంలో అమెరికా పెట్టుబడులతో కొత్త పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.

దీని వెనుక ప్రధాన లక్ష్యం.. చాబహార్ ద్వారా మధ్య ఆసియాకు భారత్ పొందుతున్న వ్యూహాత్మక ప్రవేశాన్ని అడ్డుకోవడం. కానీ, నిపుణులు హెచ్చరిస్తున్న ప్రకారం, ఇది కేవలం కౌంటర్ వ్యూహం కాదు, మరో శక్తివంతమైన దేశానికి పాకిస్తాన్ తన భూభాగాన్ని అప్పగించడమే అవుతుంది.

* చైనా గట్టిలోంచి అమెరికా ఉయ్యాలలోకి

పాకిస్తాన్‌ ఇప్పటికే చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లో భాగంగా చైనా నిర్మించిన గ్వాదర్‌ పోర్టు ద్వారా చైనా ప్రభావంలోకి వెళ్లిపోయింది. భారీ రుణాలు, పెట్టుబడుల పేరుతో పాకిస్తాన్‌ చైనాకు దాదాపు అప్పుల బానిసగా మారింది. ఇప్పుడు అదే సమయంలో అమెరికాను మరో పోర్టు ప్రాజెక్టు పేరుతో ఆహ్వానించడం ఆందోళన కలిగిస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా కూడా పోర్టు ప్రాజెక్టులో అడుగుపెడితే, పాకిస్తాన్ ప్రపంచంలోని రెండు అగ్ర రాజ్యాల మధ్య రాజకీయ బొమ్మగా మారిపోతుంది. ఈ రెండు శక్తుల మధ్య జరిగే పరోక్ష ఆధిపత్య పోరాటంలో పాక్ ఒక పావుగా మారి, తన స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చైనా బంధనాల నుండి బయటపడకముందే అమెరికా ఉయ్యాల వైపు చూడటం దీర్ఘకాలిక వ్యూహం లేమికి నిదర్శనం.

* భారత్‌ వ్యూహానికి సవాలు అంతా సులభం కాదెందుకంటే...

భారత్ యొక్క చాబహార్‌ ప్రాజెక్టు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని, వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడంలో కీలకం. అమెరికా-పాకిస్తాన్ కొత్త ఒప్పందం నిజమైతే, అది చాబహార్‌ మీద పరోక్ష ఒత్తిడి సృష్టించవచ్చు. అయితే, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే, అమెరికా సహకారం కూడా పాక్‌కు సులభంగా ఉపశమనాన్ని ఇవ్వదు.

*పాకిస్తాన్ ఎదుర్కొనే ప్రధాన ప్రమాదాలు

చైనా అప్పుల భారం ఇప్పటికే మోయలేనిది. ఇప్పుడు అమెరికా పెట్టుబడులు కొత్త రుణ భారానికి దారితీయవచ్చు. ఒకేసారి చైనా , అమెరికా ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవడం దాదాపు అసాధ్యం. ఇది పాక్ రాజకీయ నాయకత్వంపై తీవ్రమైన అంతర్గత, బాహ్య ఒత్తిడిని పెంచుతుంది.

తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం ఏ దేశాన్ని ఆశ్రయించినా, స్పష్టమైన, దీర్ఘకాలిక జాతీయ వ్యూహం లేకపోతే "కౌంటర్‌" పేరుతో పాక్ తన తలనే పగలగొట్టుకోవడం తప్పదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం భారత్‌కు కౌంటర్‌ కాదు, పాకిస్తాన్ భవిష్యత్తుకే కౌంటర్‌ అవుతుందని హెచ్చరిస్తున్నారు.