పాక్ మునిగింది.. నీటిని టబ్బుల్లో పట్టుకోవాలట
పాకిస్తాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రావిన్సుల్లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నాయి.
By: A.N.Kumar | 3 Sept 2025 5:00 AM ISTపాకిస్తాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రావిన్సుల్లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నాయి. ఇళ్లూ, పంటలూ, ఆస్తిపాస్తులూ కోల్పోయిన ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తుండగా, పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
వరద నీటిని అదృష్టంగా భావించాలా..?
స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఖవాజా ఆసిఫ్.. ప్రజలు వరద నీటిని వృథా చేయకుండా టబ్బుల్లో, కంటెయినర్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. అంతేకాక ఆ నీటిని అదృష్టంగా భావించి ఉపయోగించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విపత్తు సమయంలో ఇబ్బందులు పడుతున్న బాధితుల మనోభావాలను మరింత కుంగదీస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
- విపత్తు తీవ్రత
పాక్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం, జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా వరదల కారణంగా 854 మంది ప్రాణాలు కోల్పోగా.. 1100 మందికి పైగా గాయపడ్డారు. కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే సుమారు 7లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇప్పటికీ దాదాపు 2వేలకుపైగా గ్రామాలు నీటిలో మునిగిపోయి సహాయక చర్యలు సక్రమంగా సాగకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది.
-చిన్న డ్యామ్‌ల నిర్మాణంపై సూచన
వరదల ప్రభావాన్ని తగ్గించడానికి పెద్ద ప్రాజెక్టులు కాకుండా, చిన్న డ్యామ్‌లను నిర్మించుకోవాలని ఆసిఫ్ సూచించారు. 10-15 ఏళ్లు వేచి చూడకూడదని, తక్షణమే ఉపయోగకరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
- ప్రజల ఆగ్రహం
అయితే, ఇంత పెద్ద విపత్తులో ప్రాణాలు, ఆస్తులు కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం సరైన సహాయం అందించకపోవడమే కాకుండా, బాధను చిన్నచూపు చేసే విధంగా వ్యాఖ్యానించడం పాక్ మంత్రిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సహాయం కోసం ఎదురుచూస్తున్న ఈ సమయంలో ప్రభుత్వ అసమర్థతను మరింత బహిర్గతం చేశాయని ప్రజాభిప్రాయం.
