వాపును చూసుకొని బలుపు.. భారత్ తో యుద్ధాన్ని క్యాష్ చేసుకుంటున్న పాకిస్తాన్
అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నా.. గొప్పలు చెప్పుకోవడానికి పాకిస్థాన్ వెనకడుగు వేయడం లేదు.
By: A.N.Kumar | 8 Jan 2026 6:00 PM ISTఅప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నా.. గొప్పలు చెప్పుకోవడానికి పాకిస్థాన్ వెనకడుగు వేయడం లేదు. అప్పుల కోసం ఐఎంఎఫ్ ముందు మోకరిల్లుతోంది. ఐఎంఎఫ్ సూచనతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమ్మేందుకు సిద్ధమవుతోంది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖా మంత్రి ఖావాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పోయిన సంవత్సరం మేలో భారత్ తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఆరు నెలల తర్వాత ఐఎంఎఫ్ నుంచి తమకు అప్పు కూడా అవసరం లేనంత డిమాండ్ పెరిగి, ఆర్డర్లు వస్తున్నాయంటూ మాట్లాడారు. పాక్ మిలటరీ సామర్థ్యం ప్రపంచ దృష్టిలో పడిందంటూ ఖావాజా ఆసిఫ్ కామెంట్ చేశారు. దీనిపై భిన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోయింది. ఐఎంఎఫ్ అండ లేకుండా ముందుకు నడిచే స్థితి లేదు. అయినప్పటికీ మంత్రి ఖావాజా ఆసిఫ్ పాకిస్థాన్ మిలటరీ సామర్థ్యం, వాటికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్థికంగా చితికిన పాకిస్థాన్ కు మరో ఆదాయ మార్గం లేదు. ఆదాయం లేక అప్పులతో నడుస్తోంది. అందుకే భారత్ తో జరిగిన యుద్ధాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద తమ యుద్ధ విమానాలు చాలా గొప్పవంటూ ప్రచారం చేసుకుంటోంది. ఆ ప్రచారం వల్ల తమ యుద్ధ విమానాలు అమ్ముకోవాలని చూస్తోంది. అలాగైనా తమకు కొంత ఆర్థిక వెసులుబాటు వస్తుందని భావిస్తోంది. అందుకే రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ తమ యుద్ధ విమానాలకు డిమాండ్ పెరిగినట్టు వ్యాఖ్యానించారు. కృత్రిమంగా డిమాండ్ సృష్టించే ఒక ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోంది.
కానీ పాకిస్థాన్ కంటే బలహీన మిలటరీ సామర్థ్యం ఉన్న దేశాలే పాకిస్థాన్ తో కొనుగోలుకు ముందుకు వస్తాయి. పాకిస్థాన్ కు నిజంగా బలమైన మిలటరీ సామర్థ్యం ఉంటే ఆర్థికంగా చితికిపోదు. ఐఎంఎఫ్ అండతో నడవదు. కానీ వాస్తవాలను వక్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది.
పాకిస్థాన్ పరిస్థితికి, రక్షణ మంత్రి మాటలకు పొంతన లేదని అంటున్నారు. పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ లేకుండా మనుగడ సాగించే పరిస్థితిలేదు. అందుకే ఐఎంఎఫ్ సూచించిన విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం అమ్మడానికి సిద్ధమైనట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ చెప్పినట్టు ..పాక్ యుద్ధ విమానాలు జేఎఫ్-17, జే-10ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది అజర్బైజాన్, లిబియా మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కడా కనిపించలేదు. బంగ్లాదేశ్ చర్చలు జరుపుతోంది. అదే సమయంలో జేఎఫ్-17కు ఇతర దేశాల పరికరాలను అమర్చుతోంది. ఇంజిన్ ఒక దేశం నుంచి, ఇంకో పార్ట్ మరో దేశం నుంచి తీసుకొచ్చి అమర్చి, అందులో కొన్ని పాకిస్థాన్ తయారు చేసిన పరికరాలను అమర్చి, తామే తయారు చేసినట్టుగా అమ్ముతున్నారు. అందులో వచ్చే ఆదాయం విడి భాగాలు తయారు చేసిన దేశాలకు పోగా..పాకిస్థాన్ తయారు చేసిన పరికరాలకు, అమ్మినందుకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. వీటిని అమ్మితే వచ్చే ఆదాయంతో 300 బిలియన్ డాలర్ల అప్పును తీర్చగలదా అన్న కనీసం అవగాహన లేకుండా ఖావాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ పరువును మరింత పలచన చేస్తోంది.
