భారత్ కప్ కొడితే.. పాకిస్తాన్ లో సంబరాలు.. వైరల్ వీడియో
టీం ఇండియా మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత మహిళాసేన కైవసం చేసుకుంది.
By: A.N.Kumar | 4 Nov 2025 11:00 PM ISTటీం ఇండియా మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత మహిళాసేన కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసి, టీం ఇండియా తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకగా.. ఆశ్చర్యకరంగా పొరుగు దేశం పాకిస్థాన్‌లోనూ ఈ విజయం వేడుకగా మారింది.
*పాకిస్థాన్‌లో టీం ఇండియా విజయ సంబరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం భారత మహిళా జట్టు విజయం నేపథ్యంలో కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంది. “కేక్ కట్ వేడుక! మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన టీం ఇండియాకు అభినందనలు! భారత టీంకు పాకిస్థాన్ నుంచి ప్రేమ, మద్దతు.” అని ఆ కుటుంబం పేర్కొంది.
ఆ వీడియోలో పాకిస్థాన్ జర్సీలను ధరించిన ఆ కుటుంబ సభ్యులు, భారత టీం ఫొటోలతో ఉన్న కేక్‌ను కట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరో వీడియోలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫొటోను టీవీ స్క్రీన్‌పై ఉంచి, చిన్నారులు ఆమెకు కేక్ తినిపిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోను “arshadmuhammadhanif” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ “ఇది నిజమైన క్రీడాస్ఫూర్తి”, “సరిహద్దులు మనసులను విడగొట్టవు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
47 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి వన్డే వరల్డ్‌కప్ కైవసం కావడం విశేషం. మిథాలీ రాజ్ నాయకత్వంలో 2005, 2017లో రెండు సార్లు ఫైనల్‌కు చేరుకున్న భారత్, ఆ రెండుసార్లూ గెలుపును కోల్పోయింది. కానీ ఈసారి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో జట్టు అసాధారణ ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికాపై ఫైనల్లో ఘన విజయం సాధించి, దేశవ్యాప్తంగా అభిమానుల హర్షధ్వానాలు వినిపించాయి.
భారీ నజరానాలు
టీం ఇండియా చరిత్ర సృష్టించడంతో బీసీసీఐ సంబరాల్లో మునిగిపోయింది. వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన భారత మహిళా జట్టుకు రూ.51 కోట్ల నజరానా ప్రకటించింది. అంతేకాక, టోర్నీ అధికారిక ప్రైజ్ మనీగా మరో రూ.39 కోట్లు లభించాయి. మొత్తం రూ.90 కోట్ల బహుమతులు భారత మహిళా జట్టును కరుణించాయి.
భారత మహిళా క్రికెట్ విజయం కేవలం ఒక దేశానికే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లో కూడా ప్రజలు భారత జట్టు విజయాన్ని సంబరంగా జరుపుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. ఈ విజయం భారత్‌లోనే కాక, సరిహద్దుల పక్కన ఉన్న మనసుల్లోనూ ఆనందాన్ని నింపింది.
