శ్రీలంకకు పాకిస్థాన్ మోసపూర్తిత సహాయం... పిక్స్ వైరల్!
అవును... వరదలతో అతలాకుతలమైన శ్రీలంకతో సంఘీభావం ప్రకటించడానికి పాకిస్థాన్ ఓ ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా పలు ఆహార పదార్ధాలను కొలొంబోకు పంపింది.
By: Raja Ch | 3 Dec 2025 2:00 AM ISTదిత్వా తుపానుతో శ్రీలంక గజగజలాడుతోన్న సంగతి తెలిసిందే. ఈ తుపాను ధాటికి వరదలు వెల్లువెత్తగా, పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో ఈ తుపాను బీభత్సానికి ఇప్పటివరకూ సుమారు 400 మంది వరకూ ప్రాణాలు కొల్పోగా, పలువురు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో పలు దేశాలు శ్రీలంకకు బాసటగా నిలిచాయి, సహాయం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా... శ్రీలంకను ఆదుకునేందుకు ఇప్పటికే భారత్ రంగంలోకి దిగింది. "ఆపరేషన్ సాగర్ బంధు" పేరుతో సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు శ్రీలంకకు సాయం చేయడానికి వెళ్తామంటే... పాకిస్థాన్ కోసం పహల్గాం ఉగ్రదాడి సమయంలో మూసేసిన గగనతలానికి గంటల వ్యవధిలో అనుమతిచ్చి సహకరించింది. అయితే శ్రీలంకకు పాక్ చేసిన సాయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్ కు బలైంది!
అవును... వరదలతో అతలాకుతలమైన శ్రీలంకతో సంఘీభావం ప్రకటించడానికి పాకిస్థాన్ ఓ ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా పలు ఆహార పదార్ధాలను కొలొంబోకు పంపింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను పాకిస్థాన్ హైకమిషన్ స్వయంగా పంచుకొంది. అయితే.. ఇప్పుడు ఆ ఫోటోలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అందులో ప్యాకెట్స్ పై ఎక్స్ పైరీ డేట్ సుమారు ఏడాది క్రితంగా ఉంది.
ఇందులో భాగంగా... శ్రీలంకకు పాకిస్థాన్ సాయం అంటూ పంపించిన ప్యాకెట్స్ లేబుల్స్ పై "ఈ.ఎక్స్.పీ:10/2024" అని ఉంది. దీంతో.. ఇటీవల కాలంలో అత్యంత దారుణమైన సంక్షోభాలతో పోరాడుతున్న దేశానికి పాకిస్థాన్ ఇలా గడువు ముగిసిన ఉత్పత్తులను రవాణా చేసిందంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సహాయం చేయకపోయినా పర్లేదు కానీ.. ఇలా మోస పూరిత సహాయం చేయకూడదని అంటున్నారు.
ఈ సందర్భంగా పాక్ హైకమిషన్ పోస్ట్ చేసిన ఫోటోలలోని ప్యాకెట్లపై ఉన్న "ఈ.ఎక్స్.పీ." ని మార్క్ చేసి రీపోస్టులు, షేర్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో.. విపత్తు బాధితులను పాకిస్థాన్ అగౌరవపరుస్తోందని.. వారికి గడువు ముగిసిన వస్తువులను పంపడం ఏమాత్రం సరైంది కాదని అంటున్నారు. అయితే... దీనిపై ఆ దేశం నుంచి ఇంకా వివరణ రాలేదు!
పాక్ (మోసపు) సాయం సంగతి అలా ఉంటే... మరోవైపు శ్రీలంకకు మద్దతు ఇవ్వడానికి భారత్ భారీ మానవతా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా... ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా వాయు, సముద్ర మార్గాల ద్వారా ఇప్పటివరకూ సుమారు 53 టన్నుల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. అదేవిధంగా.. శ్రీలంకలో చిక్కుకున్న 2,000 మందికి పైగా భారతీయులను తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొసమెరుపు: ఆ ఫోటోలతో పాకిస్థాన్ అభాసుపాలైన నేపథ్యంలో... శ్రీలంకలోని పాక్ హైకమీషన్ ఆ పోస్టును తొలగించింది! మరో పోస్టులో వైట్ పాలిథీన్ కవర్స్ లో వస్తువులను ఉంచి అందిస్తున్నట్లు ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
