సౌదీకి అండగా యుద్ధంలోకి పాక్.. ఇప్పుడేం జరగనుంది?
యుద్ధంలోకి వెళ్లిపోయింది పాకిస్తాన్. సౌదీ అరేబియా, టర్కీ (తుర్కయో)తో చేసుకున్న మక్కా ఒప్పందంలో భాగంగా సౌదీకి అండగా నిలిచేందుకు యెమన్ లోని హోతీలపై యుద్ధానికి అడుగు ముందుకు వేసింది.
By: Garuda Media | 6 Oct 2026 10:16 AM ISTయుద్ధంలోకి వెళ్లిపోయింది పాకిస్తాన్. సౌదీ అరేబియా, టర్కీ (తుర్కయో)తో చేసుకున్న మక్కా ఒప్పందంలో భాగంగా సౌదీకి అండగా నిలిచేందుకు యెమన్ లోని హోతీలపై యుద్ధానికి అడుగు ముందుకు వేసింది. ఇప్పటివరకు రక్షణ.. శాంతి భద్రతల పేరుతో ఇతర దేశాలకు తన సైనికులను పంపిన పాకిస్తాన్.. తాజాగా యెమెన్ హోతీల ముప్పును ఎదుర్కొనేందుకు మక్కా కూటమి ద్వారా ఒక అధికారిక ప్రాంతీయ సైనిక కూటమిలో భాగస్వామి కావటం సరికొత్త భౌగోళిక రాజకీయ పరిణామంగా చెప్పాలి. ఓవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కిందా మీదా పడుతున్న పాకిస్తాన్ కు తాజా యుద్ధం ఎలాంటి పరిస్థితిని తీసుకురానుందన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి.
చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సౌదీ ఇచ్చే బిలియన్లకొద్దీ డాలర్లఆర్థిక ప్యాకేజీలు.. ఉచిత చమురు సాయాన్ని అందుకుంటూ బండి లాగిస్తున్న వేళ.. తమ దేశానికి ఆర్థిక రక్షణగా నిలిచిన సౌదీ అరేబియా ఆపదలో ఉన్న వేళ.. యెమెన్ లోని హోతీలతోయుద్దానికి సై అనక తప్పని పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా ఎజెండాను అమలు చేయటంతో పాటు.. ఇస్లాం పవిత్ర నగరాలైన మక్కా.. మదీనాల భద్్రతకు హోతీల క్షిపణుల కారణంగా ముప్పు ఉందన్న వాదనను సౌదీ వినిపిస్తున్న వేళ.. ముస్లిం ప్రపంచంలో ఏకైక అణుశక్తి ఉన్న దేశంగా నిలిచిన పాక్.. పవిత్ర స్థలాల రక్షణ కోసం సైన్యాన్ని పంపటం పాక్ కు మతపరంగా అనివార్యంగా మారింది.
ఈ వాదనకు తగ్గట్లే మక్కా.. మదీనాల రక్షణ మా రెడ్ లైన్ అని ప్రకటించటం నిదర్శనం. అమెరికాకు సౌదీ అరేబియా ప్రధాన రక్షణ భాగస్వామి. ఎర్రసముద్రంలో హోతీలు అంతర్జాతీయ ఓడలపై.. అమెరికా నౌకలపైదాడులు చేస్తున్న వేళ.. వారిని అడ్డుకోవటానికి అమెరికా ఇప్పటికే ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అమెరికా సొంతంగా మధ్యప్రాచ్యంలో మరో కొత్త యుద్ధానికి దిగేందుకు ఇష్టం లేదు. అందుకే సౌదీకి మిత్రదేశంగా ఉన్న పాక్.. తన సైనికులను హోతీలకు వ్యతిరేకంగా పంపే విషయంలో అగ్రరాజ్యానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
నిజానికి హోతీలో యుద్ధం పాక్ కు సుతారం ఇష్టం లేదు. ఎందుకంటే.. ఈ యుద్ధం కారణంగా తక్షణం ఆర్థిక కష్టాల నుంచి కాస్తంత ఊరట కలిగినా.. దీర్ఘకాలికంగా ఆ దేశానికి పెద్ద దెబ్బే. ఎందుకంటే ఇరాన్ తో సుదీర్ఘ సరిహద్దును పంచుకునే పాకిస్తాన్.. ఇరాన్ మద్దతుతో చెలరేగే హోతీలను నియంత్రించటం అంటే.. ఇరాన్ తో పెట్టుకోవటమే అవుతుంది. అందుకే.. ప్రస్తుతానికి ఈ యుద్ధం పాక్ కు కొంత ఆర్థిక ఊరటను కలిగించినా.. దీర్ఘకాలంలో మాత్రం ఆ దేశం కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన దుస్థితి. అమెరికా-సౌదీ కూటమి ఒత్తిడికి తట్టుకోలేక యుద్ధానికి ఓకే చెప్పి.. దాదాపు పాతికవేల మంది సైనికులను సౌదీకి రక్షణ కవచంలా నిలిచేందుకు సిద్ధమైన పాక్ రానున్న రోజుల్లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.
తాజా యుద్దంలో పాక్ సైన్యం యెమన్ భూభాగంలోకి వెళ్లదు. అదే సమయంలో పాక్ దళాలు సౌదీ అరేబియా సరిహద్దులు.. వైమానిక రక్షణ.. నిఘా.. డ్రోన్ నిరోదక వ్యవస్థల బాధ్యతలను చూసుకుంటుంది. ఓవైపు పాక్.. మరోవైపు టర్కీ దళాలు సౌదీ అంతర్గత రక్షణ బాధ్యతల్ని తీసుకోవటం ద్వారా సౌదీ అరేబియా తన సొంత సైన్యాన్ని పూర్తిగా యెమన్ లోని హోతీలపై ఎదురుదాడికి వినియోగిస్తుందని చెప్పాలి.
ఇదంతా సరే.. ఇంతకూ సౌదీకి సాయంగా నిలిచేందుకు టర్కీతోకలిసి పాక్ మొదలుపెట్టిన యుద్దం ఎంతకాలం సాగుతుంది? హోతీల న్యూట్రలైజ్ చేయటం ఎప్పటికి పూర్తి అవుతుందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. డాన్ ఆఫ్ యెమెన్ పేరుతో మొదలు పెట్టిన తాజా విముక్తి పోరు కొన్ని వారాల్లో ముగుస్తుందని అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే. అంతర్జాతీయ సైనిక విశ్లేషకులు అంచనాల ప్రకారం ఈ యుద్ధం కొన్ని నెలలు.. కొన్నేళ్ల పాటు సాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
దాదాపు పుష్కర కాలంగా యెమెన్ అంతర్యుద్దం ఏదో రూపంలో సాగుతోంది. ఇప్పుడు సౌదీ.. పాక్.. టర్కీలు మక్కా కూటమి పేరుతో ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. దీంతో హోతీలపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. భౌగోళిక పరిస్థితులు.. ఇరాన్ క్షిపణి మద్దతు నేపథ్యంతో పాటు హోతీలు జరిపే గెరిల్లా యుద్ధ వ్యూహాల కారణంగా యుద్ధం సుదీర్ఘకాలం సాగనుందని చెబుతున్నారు. మక్కా కూటమికి చెందిన భారీ సైన్యాన్ని ఎదుర్కోవటానికి హోతీలు యెమెన్ కొండ ప్రాంతాలను.. భూగర్భ బంకర్లను వాడుతున్నారు. నేరుగా యుద్ధం చేయకుండా గెరిల్లా తరహా దాడులు చేస్తూ.. క్షిపణుల.. డ్రోన్లతో సౌదీ రాజధాని రియాద్ ఎయిర్ పోర్టు.. చమురు సంస్థలను టార్గెట్ గా చేశారని చెప్పాలి. ఈ దాడులను నియంత్రిస్తూ.. హోతీలను దెబ్బ తీయటమే పాక్.. టర్కీ సైనికుల పని. దీంతో.. ఈ యుద్ధం సుదీర్ఘకాలం సాగనుందని చెప్పక తప్పదు.
