Begin typing your search above and press return to search.

పాక్ పీక మీదకు వచ్చిన యుద్ధం

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చింది అన్నది పాకిస్థాన్ విషయంలో నిజమవుతోంది. ఇరాన్ అంటే పాకిస్థాన్ కి ఇష్టమైన దేశమే.

By:  Satya P   |   10 March 2026 9:16 AM IST
పాక్ పీక మీదకు వచ్చిన యుద్ధం
X

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చింది అన్నది పాకిస్థాన్ విషయంలో నిజమవుతోంది. ఇరాన్ అంటే పాకిస్థాన్ కి ఇష్టమైన దేశమే. పాక్ ప్రేమ అంతా ఇంతా కాదు, ఇరాన్ కి మద్దతుగా తొందరలో యుద్ధానికి వెళ్ళాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదంతా ఒక ఎత్తు అయితే ఇపుడు పాకిస్తాన్ ని ఇరాన్ అమెరికా యుద్ధం కొంప ముంచేలా చేస్తోంది. ఇరాన్ ఏకంగా హర్మూజ్ జల సంధిని మూసేసి కూర్చుంది. భారత్ లాంటి పెద్ద దేశాలకే చమురు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే తట్టుకోవడానికి వేరే మార్గాలని చూస్తోంది ఇండియా. ఇప్పటికే అన్ని విధాలుగా చితికిపోయిన పాక్ కి మాత్రం ఈ యుద్ధం పెడుతున్న మంటలు ఒక్కలా లేవు అని అంటున్నారు.

చమురు కొరతతో చిక్కులు :

ప్రపంచం అంతా చమురు కొరతకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే పాక్ కి ఈ సమస్య చాలా ముందే వచ్చేసింది. దాంతో పాక్ కి ఏమి చేయాలో తోచక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దాంతో పెద్ద ఎత్తున కోతలు పెడుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు పాక్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. దాంతో పాక్ ప్రజలకు ఉన్న కష్టాలకు తోడు ఈ కొత్త కష్టాలు దాపురించాయని అంటున్నారు.

స్కూళ్ళకు సెలవులు :

పాక్ లోని స్కూళ్ళకు ఏకంగా పదిహేను రోజుల పాటు అక్కడి ప్రభుత్వం సెలవు ఇచ్చేసింది. ఉన్నత విద్యా సంస్థలు అయితే ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించుకోవాలని సూచించింది. ఇక ఆఫీసులకు కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే నడపాలని ఆదేశించింది. అంటే ఆరు రోజుల వర్క్ కి రెండు రోజులు కోత అన్న మాట. ఇక మంత్రులు ఎంపీల జీతాలలో భారీ కోత పెట్టేసింది. ప్రభుత్వ వాహనాలలో ఇంధన కోటాను వాటాను యాభై శాతానికి విధించింది. అలాగే అరవై శాతం వాహనాలను అసలు నడపవద్దు అని ఆదేశించింది.

కదలని మెదలని స్థితికి :

ఒక విధంగా ఇరాన్ అమెరికా యుద్ధం పది రోజులు చేరుకోగానే మొదట షాక్ తిన్నది పాక్ అనే అంటున్నారు. దాంతో పాక్ దేశం కదలని మెదలని దశకు చేరుకుంది అని అంటున్నారు. అయితే ఈ కోతలు తొలి అడుగుగా చెబుతున్నారు. రానున్న కాలంలో యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగినట్లు అయితే పాక్ ఇంకా పెద్ద స్థాయిలో కోతలకు సిద్ధపడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒక విధంగా ఈ యుద్ధానికి మొదటి బలి పాక్ అయింది అని అంటున్నారు. ఆర్ధికంగా పూర్తిగా చితికిపోయిన స్థితిలో ఉంటూ అప్పులతో సర్కార్ ని నడుపుతున్న పాక్ కి ఈ భారీ ఇంధన సంక్షోభం తట్టుకోవడం పెను సవాల్ గా చెబుతున్నారు. ఉన్నంతలో ప్రభుత్వం ఈ కోతలతో నెట్టుకుని రావాలని చూస్తున్నా లాంగ్ టెర్మ్ లో మాత్రం తీవ్రమైన ఇంధన సంక్షోభంలో పడుతుందని అంటున్నారు. అది ఆర్థిక సంక్షోభానికి దారి తీయవచ్చు అని అంటున్నారు. మరి పాక్ ఈ కష్టకాలంలో ఏ మిత్రులను ఆశ్రయిస్తుందో చూడాల్సి ఉంది.