Begin typing your search above and press return to search.

‘అప్పుల తిప్ప‌లు’.. పాక్ విమానాల‌కు సైన్యం రెక్క‌లు..

భార‌త్ కంటే ఒక్క రోజు ముందు 1947 ఆగ‌స్టు 14న ఏర్పాటైంది పాకిస్థాన్. ఆ త‌ర్వాత 11 ఏళ్ల నుంచి (1958) చూస్తే పాక్ ఐఎంఎఫ్ నుంచి 20 కంటే ఎక్కువ‌సార్లు రుణం తీసుకుంది.

By:  Tupaki Political Desk   |   4 Dec 2025 7:00 PM IST
‘అప్పుల తిప్ప‌లు’.. పాక్ విమానాల‌కు సైన్యం రెక్క‌లు..
X

పాకిస్థాన్ అంటే రోగ్ కంట్రీ.. అక్క‌డ ఏ వ్య‌వ‌స్థ కూడా స‌క్ర‌మంగా న‌డ‌వ‌దు. అందుకే అన్ని దేశాల‌కు సైన్యం ఉంటే.. సైన్యానికే ఒక దేశం ఉంది.. దాని పేరు పాకిస్థాన్ అని సెటైర్ వేస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే విష‌యం చూస్తే అది నిజ‌మే అనిపిస్తుంటుంది. కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది పాక్. దాని ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది. దీంతో అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌)ను ప‌దేప‌దే నిధులు అడుగుతోంది. అయితే.. అలాంటి సంస్థ‌లు ఏవీ ఉత్తిగా నిధులు ఇవ్వ‌వు క‌దా..? కొన్ని ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను సూచించి.. అవి చేప‌డితేనే తాము రుణం ఇస్తామ‌ని చెబుతాయి. ఇలా ఐఎంఎఫ్ చెప్పిన మేర‌కు పాకిస్థాన్ అంత‌ర్జాతీయ ఎయిర్ లైన్స్ (పీఐఏ)ను అమ్మేసేందుకు సిద్ధ‌మైంది. స‌హ‌జంగా మిగ‌తా దేశాల్లో అయితే ఇంత పెద్ద డీల్ ను సొంతం చేసుకునేందుకు కార్పొరేట్ సంస్థ‌లు పోటీ ప‌డ‌తాయి. కానీ, అది పాకిస్థాన్ క‌దా.. పీఐఏను కొనేందుకు ఫౌజీ ఫ‌ర్టిలైజ‌ర్స్ కంపెనీ బిడ్డింగ్ వేసింది. ఈ సంస్థ‌.. పాక్ సైన్యం ఆధీనంలోని ఫౌజీ ఫౌండేష‌న్ కు చెందిన‌ది కావ‌డం గ‌మ‌నార్హం.

20 కంటే ఎక్కువ‌సార్లు అప్పులు..

భార‌త్ కంటే ఒక్క రోజు ముందు 1947 ఆగ‌స్టు 14న ఏర్పాటైంది పాకిస్థాన్. ఆ త‌ర్వాత 11 ఏళ్ల నుంచి (1958) చూస్తే పాక్ ఐఎంఎఫ్ నుంచి 20 కంటే ఎక్కువ‌సార్లు రుణం తీసుకుంది. రెండేళ్ల కింద‌ట దాని ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా ప‌త‌న‌మైంది. కుప్ప‌లుగా రుణాలు, భారీ ర‌క్ష‌ణ వ్యయ‌మే దీనికి కార‌ణం. గ‌త ఏడాది ఏడు బిలియ‌న్ డాల‌ర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకొంది. బిలియ‌న్ డాల‌ర్లు ఇచ్చేయ‌గా.. ష‌ర‌తులతో మిగ‌తావీ ఇస్తామ‌ని పేర్కొంది. ఈ ష‌ర‌తుల్లో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అమ్మ‌కం కూడా ఒక‌టి కావ‌డం గ‌మ‌నార్హం.

20 ఏళ్ల‌లో తొలి ప్రైవేటీక‌ర‌ణ‌..

ఏకంగా విమాన‌యాన సంస్థ‌నే ప్రైవేటీక‌ర‌ణ చేస్తున్న పాక్ ప్ర‌భుత్వం.. ప్రైవేటీక‌ర‌ణ‌తో ఈ ఏడాది 8600 కోట్ల పాక్ రూపాయిల‌ను ఆర్జించాల‌ని చూస్తోంది. ఈ నెల 23న బిడ్డింగ్ జ‌ర‌గ‌నుంది. చివ‌రి రౌండ్ బిడ్డింగ్ లో వ‌చ్చిన‌దాంట్లో 15 శాతం ప్రభుత్వానికి, 85 శాతం పీఐఏకు వెళ్తాయి.

ఫౌజీ ఫౌండేష‌న్ ప‌రిధిలో ప‌నిచేసే 35కు పైగా అనుబంధ‌ కంపెనీల్లో ఫౌజీ ఫ‌ర్టిలైజ‌ర్స్ ఒక‌టి. 1954లో ఏర్పాటైన ఈ ట‌స్టు పాక్ సైన్యం ఉన్న‌తాధికారుల ఆధ్వ‌ర్యంలో న‌డుస్తుంది. కాబ‌ట్టి బిడ్డింగుల్లో పోటీ ఉండ‌దు. పేరుకు పీఏఐ టెండ‌ర్ల‌కు నాలుగు కంపెనీలు బిడ్డింగ్ వేసినా, ఫౌజీ ఫర్టిలైజ‌ర్స్ కే ద‌క్కుతుంద‌ని అంటున్నారు.