పాకిస్తాన్ దివాళా.. దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే?
పెరిగిన పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యం వాడే కూరగాయల ఖర్చులు ప్రజల నడుము విరుస్తున్నాయి. ఒకవైపు ఆదాయ మార్గాలు తగ్గిపోతుంటే మరోవైపు ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఆహార వ్యయం విపరీతంగా పెరగడం అక్కడి ప్రజలను కోలుకోలేని దెబ్బతీస్తోంది.
By: A.N.Kumar | 31 Aug 2026 4:00 AM ISTపాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ సామాన్య ప్రజల జీవనాన్ని తీవ్ర దుర్భరం చేస్తోంది. దేశంలోనే అత్యంత కీలకమైన, ప్రాచీన నగరాల్లో ఒకటైన లాహోర్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. పెరిగిన పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యం వాడే కూరగాయల ఖర్చులు ప్రజల నడుము విరుస్తున్నాయి. ఒకవైపు ఆదాయ మార్గాలు తగ్గిపోతుంటే మరోవైపు ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఆహార వ్యయం విపరీతంగా పెరగడం అక్కడి ప్రజలను కోలుకోలేని దెబ్బతీస్తోంది.
మార్కెట్‌కు వెళ్తే షాక్.. అందని ద్రాక్షలా నిత్యావసరాలు
లాహోర్ మార్కెట్లలో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. గోధుమపిండి, వంటనూనె, పప్పులు వంటి ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. సాధారణ కూరగాయలైన బంగాళాదుంపలు, టమోటాల ధరలు కూడా కిలో రూ.150 నుండి రూ.300 వరకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపాదన మొత్తం తిండికే సరిపోతుండటంతో పిల్లల చదువులు, అత్యవసర వైద్య ఖర్చులను కూడా వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
చాలని పెన్షన్లు.. ఆటో నడిపినా మిగలని ఆదాయం
ఈ సంక్షోభం వృద్ధులను, స్వయం ఉపాధిదారులను మరింత కోలుకోలేని దెబ్బతీసింది. ప్రభుత్వం నుంచి వచ్చే పరిమిత పెన్షన్‌తో కుటుంబ పోషణ, వైద్య ఖర్చులు భరించడం అసాధ్యంగా మారిందని రిటైర్డ్ టీచర్ మన్సూర్ అలీ వాపోయారు. మరోవైపు ఆటో డ్రైవర్ ఉస్మాన్ అలీ మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరల వల్ల రోజంతా కష్టపడి ఆటో నడిపినా వచ్చిన రాబడి ఇంధనానికే సరిపోతోందని, రోజు చివర్లో చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.
కాగితాలకే పరిమితమైన ప్రభుత్వ ధరలు
ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన ధరలకు, మార్కెట్లలో విక్రయిస్తున్న వాస్తవ ధరలకు భారీ వ్యత్యాసం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్లను వ్యాపారులు విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రవాణా చార్జీలుగానీ, ఆహార ధాన్యాల ధరలుగానీ స్థానిక మార్కెట్‌లో తగ్గకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి విపరీతమైన ద్రవ్యోల్బణం, చాలీచాలని ఆదాయంతో లాహోర్ నగరంలో సామాన్యుడి జీవనం ఒక నరకంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి, నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకురావాలని లాహోర్ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
