Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ను జైల్లో పండబెట్టి.. ఆసిమ్ మునీర్ కు సర్వాధికారాలా?

ప్రపంచవేదికపై శాంతి, స్థిరత్వంపై చర్చ జరుగుతుందడగా పాకిస్తాన్ మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి తన దురుద్దేశాన్ని చాటుకుంది.

By:  A.N.Kumar   |   16 Dec 2025 4:37 PM IST
ఇమ్రాన్ ను జైల్లో పండబెట్టి.. ఆసిమ్ మునీర్ కు సర్వాధికారాలా?
X

పాకిస్తాన్ ది ఎప్పుడు ముసలి కన్నీరు.. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లోనే కనిపిస్తాయి. బిన్ లాడెన్ నుంచి మొదలుపెడితే నేడు ఆస్ట్రేలియాలో తండ్రీ కొడుకుల కాల్పుల ఘటన వరకూ వారంతా పాకిస్తాన్ వారే.. పాకిస్తాన్ లో ఉన్న వారే కావడం గమనార్హం. అలాంటి ఉగ్రవాద ఫ్యాక్టరీ పైకి నీతులు చెబుతుంటుంది.

ప్రపంచవేదికపై శాంతి, స్థిరత్వంపై చర్చ జరుగుతుందడగా పాకిస్తాన్ మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి తన దురుద్దేశాన్ని చాటుకుంది. దీనికి భారత్ ఘటైన సమాధానం ఇచ్చింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ను జైలుకు పంపి ఆయనకు విరోధి అయిన సైనిక దళాల చీఫ్ ఆసిమ్ మునీర్ కు సర్వాధికారాలు ఇవ్వడంపై కౌంటర్ ఇచ్చింది.

పాక్ వక్రబుద్ది.. భారత్ గట్టి బదులు..

పాక్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. తాము దక్షిణాదిలో శాంతి స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే శాంతి అనేది ఏకపక్షంగా ఉండకూడదని.. జమ్మూకశ్మీర్ వివాదంపై సమస్య ఇంకా మిగిలి ఉందని.. దానికి న్యాయమైన పరిష్కారం అవసరమని వాదించారు. అంతేకాక.. భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేసిందంటూ ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ , లద్ధాఖ్ లు భారత్ లో అంతర్భాగమని పునరుద్ఢాటించారు. కేవలం భారత్ కు, దేశ ప్రజలకు ముప్పు తలపెట్టడంపైనే పాక్ దృష్టి ఉంటుందని ఆయన విమర్శించారు. ‘65 ఏళ్ల క్రితం విశ్వాసం, సంకల్పం, స్నేహస్ఫూర్తి తో భారత్ సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమయంలో మాపై పాక్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులకు పాల్పడి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గత నాలుగు దశాబ్ధాల్లో పాక్ ఉగ్రవాదుల దాడుల వల్ల పదివేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అని హరీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్ లో ఈ ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడిని కూడా ఆయన ప్రస్తావించారు. దాని కేసులో చార్జిషీటు దాఖలైన విషయాన్ని గుర్తు చేశారు.

పాక్ అంతర్గత రాజకీయాలపై విమర్శలు

పాక్ ఉగ్రచర్యల కారణంగానే భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందని హరీష్ స్పష్టం చేశారు. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపి.. రక్షణ దళాల చీఫ్ ఆసిమ్ మునీర్ కు సర్వాధికారాలు అప్పగించిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

ఈ విధంగా ఐరాసలో శాంతి స్థాపన గురించి చర్చ జరుగుతున్న సమయంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్ కు భారత్ గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా ఆ దేశ అంతర్గత రాజకీయాలపై, ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా విమర్శలు గుప్పించి దిమ్మదిరిగేలా చేసింది.