పాకిస్థాన్ డ్రైవర్‌లెస్ కారు.. గొప్పగా చెప్పుకోబోయి నవ్వులపాలు!
తన గొప్ప ఆవిష్కరణను ప్రపంచానికి చాటిచెప్పాలని ఆరాటపడి, ఒక మీడియా రిపోర్టర్‌ను పిలిచి లైవ్ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
By: A.N.Kumar | 1 Sept 2026 11:48 AM ISTటెక్నాలజీలో తాము ప్రపంచాన్ని ఏలేస్తున్నామని నిరూపించుకోవడానికి పాకిస్థాన్ పడిన ఆరాటం.. చివరికి ఏకంగా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి హాస్య ఘట్టంగా ముగిసింది. అబాటాబాద్‌కి చెందిన ఒక మేధావి యువకుడు డ్రైవర్ లేకుండా నడిచే ‘సంచలన’ కారును తయారు చేశానని ప్రకటించాడు. ఏదో చిన్నపాటి రిమోట్ కారు కాదండోయ్.. ఏకంగా శాటిలైట్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో నడిచే రోదసి స్థాయి టెక్నాలజీ అని బిల్డప్ ఇచ్చాడు.
తన గొప్ప ఆవిష్కరణను ప్రపంచానికి చాటిచెప్పాలని ఆరాటపడి, ఒక మీడియా రిపోర్టర్‌ను పిలిచి లైవ్ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. రిపోర్టర్ కూడా పాకిస్థాన్ రాబోయే కాలంలో టెస్లాకు గట్టి పోటీ ఇస్తుందేమోనన్న ఆశతో కెమెరా ముందు కారును టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. కారు డ్రైవర్ లేకుండా ముందుకు కదలగానే అక్కడున్న వారంతా అద్భుతం అని మురిసిపోయారు.
తీరా సీన్ కట్ చేస్తే.. కారు హఠాత్తుగా అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన పద్ధతిగా ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని "ఢచ్" అని ఢీకొట్టింది. దాంతో రిపోర్టర్‌తో సహా చుట్టుపక్కల ఉన్న జనం బిత్తరపోయారు.
సరిగ్గా కారు పోలీస్ జీపును గుద్దిన సమయానికే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిందని.. అందుకే ఈ చిన్న సమస్య వచ్చిందని సదరు యువకుడు చాలా సమర్థంగా వివరణ ఇచ్చాడు. నిజమైన డ్రైవర్‌లెస్ కార్లు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ఆగిపోయేలా 'సేఫ్‌టీ ఫెయిల్-సేఫ్' వ్యవస్థలను కలిగి ఉంటాయి. కానీ మన పాక్ వెర్షన్‌లో మాత్రం నెట్ పోగానే కారు నేరుగా పోలీస్ స్టేషన్‌కే దారి తీసేలా ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లుంది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "డ్రైవర్ అవసరం లేదన్నారు సరే.. కానీ కనీసం నెట్ ఉన్నప్పుడైనా బ్రేకులు పనిచేసేలా చూసుకోవాలి కదా బాస్" అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇది శాటిలైట్ కారా లేక రూ. 500 పెట్టి కొన్న చైనా రిమోట్ కారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా టెక్నాలజీ ప్రదర్శించి వార్తల్లో నిలవాలనుకున్న ఆ యువకుడు.. ప్రస్తుతం కామెడీ వీడియోలతో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచాడు.
