మీ బుద్ది మారదా? మీ పీఓకే ప్రజలను భారత్ కు అంటగడతారా?
తన సొంత పౌరులపైనే తుపాకులు ఎక్కుపెట్టి.. వాళ్లనే శత్రువులుగా ముద్ర వేయడంలో పాకిస్థాన్ నాయకులను మించిన జ్ఞానులు విశ్వంలోనే ఉండరనడానికి మరో నమూనా లభించింది.
By: A.N.Kumar | 29 July 2026 12:10 PM ISTతన సొంత పౌరులపైనే తుపాకులు ఎక్కుపెట్టి.. వాళ్లనే శత్రువులుగా ముద్ర వేయడంలో పాకిస్థాన్ నాయకులను మించిన జ్ఞానులు విశ్వంలోనే ఉండరనడానికి మరో నమూనా లభించింది.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గారు తాజాగా నోరు విప్పి ఒక దివ్యమైన సత్యాన్ని ఆవిష్కరించారు. అదేంటంటే... పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లెక్కిన నిరసనకారులు, భారత్ ఇద్దరూ ఒకటేనట! వారంతా పాకిస్థాన్‌కు ముమ్మాటికీ శత్రువులేనట.. మంత్రి గారి ఈ విప్లవాత్మక ఆవిష్కరణ చూసి నెటిజన్లతో పాటు భారత్ కూడా "పాక్ సర్కార్ వారి పప్పులు ఉడికినట్టే" అని తెగ మురిసిపోతోంది.
సొంత ప్రజలపై యుద్ధం... భలే సమర్థన
ఒక స్థానిక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన రక్షణ మంత్రి గారు తీవ్రమైన గంభీరతను నటిస్తూ పీఓకే నిరసనకారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. "చర్చలు బంద్ హక్కుల కోసం పోరాడుతున్న పీఓకే ప్రజలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదట.. ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ ఛార్జీల బాదుడు, ద్రవ్యోల్బణం భరించలేక నిరసన తెలపడమే పీఓకే ప్రజలు చేసిన మహాప నేరం. అందుకే వాళ్లు భారత్‌తో సమానమైన శత్రువులట... కాల్పులు కరెక్టేనని.. శాంతియుతంగా రోడ్లపైకి వచ్చిన వారిపై భద్రతా బలగాలు గుండ్ల వర్షం కురిపించడాన్ని మన ఖవాజా గారు నిష్పాక్షికంగా సమర్థించుకున్నారు. అంటే హక్కులు అడిగితే బియ్యం బస్తాలు ఇవ్వరు గానీ బుల్లెట్లు మాత్రం ఉచితంగా సప్లై చేస్తారన్నమాట..
ఈ మాటలు విన్నాక నెటిజన్లు ఊరుకుంటారా? "పీఓకే ప్రజలు పాకిస్థానీలు కారు.. వాళ్లంతా భారత్‌తో సమానమే అని మంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు. అంటే పీఓకే భారత్‌దేనని గట్టిగా కన్ఫర్మ్ చేసిన ఖవాజా ఆసిఫ్ గారికి మన సత్కారం తప్పకుండా ఉండాల్సిందే" అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
రక్తసిక్తమైన 'ప్రజాస్వామ్య' నాటకం
ఒకపక్క ఆకలి చావులు, మరోపక్క ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం నడుమ పీఓకేలో 45 అసెంబ్లీ సీట్లకు అతిపెద్ద 'ప్రజాస్వామ్య నాటకం' నడుస్తోంది. జులై 27న జరిగిన తొలిదశ ఎన్నికల్లో అధికార పీఎంఎల్-ఎన్ తొమ్మిది, పీపీపీ నాలుగు సీట్లు గెలుచుకున్నాయని పాక్ ఎన్నికల సంఘం చాలా గర్వంగా చెప్పుకుంది. అయితే ఈ 'ఎన్నికల సంబరం' వెనుక అసలు కథ వేరే ఉంది. హక్కుల కోసం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలపై బలగాలు జరిపిన కాల్పుల్లో ఏకంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజాస్వామ్యం అంటే బ్యాలెట్ బాక్సులు నింపడం కాదేమో శవాల కుప్పలు పేర్చడమేమో అని అక్కడి జనాలు గగ్గోలు పెడుతున్నారు.
భారత్ కౌంటర్.. "మీ నాటకాలు మాకు తెలీవా ఏంటి?"
మంత్రి గారి కామెంట్లు అక్కడి రక్తపాతం చూసిన భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్‌కు గట్టిగానే ఇచ్చిపడేసింది. "పీఓకేలో మీరు జరుపుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను, సైనిక దౌర్జన్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ నకిలీ ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారు" అని తిరస్కరించింది.
భారత్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్
పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలు చారిత్రకంగా, చట్టపరంగా ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే.. అక్కడ మీరు ఎన్ని దొంగ ఎన్నికలు నిర్వహించినా, ఎంతమంది రక్షణ మంత్రులు వచ్చి 'శత్రువు' అని అరిచినా ఆ నిజం మారిపోదు.
మొత్తానికి పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ గారు నోరు జారిన పుణ్యమా అని.. పీఓకేలో పాకిస్థాన్ ఆక్రమణ ఎంత అమానుషంగా ఉందో అక్కడి ప్రజలకు పాక్ ప్రభుత్వంపై ఎంత అసహ్యం ఉందో ప్రపంచమంతటికీ సాక్ష్యాలతో సహా మరోసారి స్పష్టమైపోయింది..
