భారత్ నా మాతృభూమి.. పాక్ క్రికెటర్ సంచలన కామెంట్స్
ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్టార్ లెగ్ స్పిన్నర్‌గా వెలుగొందిన దానిష్ కనేరియా ఇప్పుడు తన వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన 'భారత్ నా మాతృభూమి' అనే సంచలన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో పెద్ద దుమారాన్ని రేపాయి.
By: A.N.Kumar | 6 Oct 2025 8:45 AM ISTఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్టార్ లెగ్ స్పిన్నర్‌గా వెలుగొందిన దానిష్ కనేరియా ఇప్పుడు తన వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన 'భారత్ నా మాతృభూమి' అనే సంచలన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో పెద్ద దుమారాన్ని రేపాయి. కనేరియా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
*మతపరమైన వివక్ష ఆరోపణలు
2000 నుండి 2010 మధ్యకాలంలో పాకిస్తాన్ తరఫున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన కనేరియా.. తన కెరీర్‌లో 261 టెస్టు వికెట్లు సాధించినప్పటికీ, తన విజయవంతమైన కెరీర్ తర్వాత ఆయన క్రికెట్ కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్ ద్వారా పలు కీలక విషయాలను స్పష్టం చేశారు. "నేను భారత్ గురించి మాట్లాడటం, పాకిస్తాన్‌పై విమర్శలు చేయడం వెనుక ఎలాంటి స్వార్ధం లేదని" ఆయన పేర్కొన్నారు.
అధికారులు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనపై మతపరమైన వివక్ష చూపించాయని కనేరియా ఆరోపించారు. "నేను పాకిస్తాన్ ప్రజల ప్రేమను పొందాను, కానీ అక్కడి అధికారులు, పీసీబీ మాత్రం నాపై మతపరమైన వివక్ష చూపించారు," అని ఆయన పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా తాను బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలకు గురయ్యానని కూడా దానిష్ కనేరియా వెల్లడించారు.
"భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది"
తన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కనేరియా తన స్పందనను మరింత బలంగా వినిపించారు. "పాకిస్తాన్ నా జన్మభూమి కావచ్చు, కానీ భారత్ నా పూర్వీకుల భూమి, నా మాతృభూమి, దేవాలయం లాంటిది" అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లోని వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని, చర్చను రేకెత్తించాయి.
సీఏఏపై స్పందన – నైతిక ధర్మం కోసమే పోరాటం
కొందరు తనను భారత పౌరసత్వం కోసం ఇలా చేస్తున్నానని ఆరోపించడంపై కూడా కనేరియా స్పందించారు. "నన్ను కొందరు భారత పౌరసత్వం కోసం ఇలా చేస్తున్నానని అంటున్నారు. కానీ ఇది అసత్యం. ప్రస్తుతం నేను భారత పౌరసత్వం కోరడం లేదు. అయితే నా వంటి వారికోసం సీఏఏ ఇప్పటికే మార్గం చూపింది" అని తెలిపారు."నా వ్యాఖ్యలు పౌరసత్వం కోసం కావు, అది నా నైతిక ధర్మం కోసం" అని కనేరియా తేల్చిచెప్పారు.
'నకిలీ లౌకికవాదులను బహిర్గతం చేస్తా'
తాను ధర్మం కోసం నిలబడతానని స్పష్టం చేసిన కనేరియా, "మన సమాజాన్ని విభజించే నకిలీ లౌకికవాదులను బహిర్గతం చేస్తాను. దేశద్రోహులను ఎదుర్కొనే ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉండాలి," అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ.. సామాజిక వర్గాలలో పెద్ద చర్చకు దారితీశాయి.
ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ (UK)లో నివాసం ఉంటున్న దానిష్ కనేరియా, తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులకు ధైర్యం చెప్పారు. "ప్రభు శ్రీరాముని కృపతో నేను, నా కుటుంబం సురక్షితంగా ఉన్నాం. నా విధి రాముని చేతుల్లోనే ఉంది" అని పేర్కొన్నారు.
పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించిన ఒక లెగ్ స్పిన్నర్ ఈ విధంగా బహిరంగంగా భారత్‌పై ప్రేమను, ధార్మిక వైఖరిని వ్యక్తం చేయడం, పాకిస్తాన్‌లో మతపరమైన వివక్ష ఉందని ఆరోపించడం ప్రస్తుతానికి అత్యంత సంచలనాత్మక అంశంగా నిలిచింది. కనేరియా వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రభుత్వం లేదా క్రికెట్ బోర్డు ఇంకా అధికారికంగా స్పందించలేదు.
