బలూచిస్తాన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ప్రజల ఇంధనాన్ని కాల్చివేసిన పాక్ అధికారులు
పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ ప్రజలపై మరోసారి కఠిన చర్యలకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
By: A.N.Kumar | 9 March 2026 8:07 PM ISTపాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ ప్రజలపై మరోసారి కఠిన చర్యలకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బలూచ్ ప్రజల జీవనాధారమైన ఇంధనాన్ని కాల్చివేయడం ద్వారా వారి ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బకొట్టిందని బలూచ్ యక్జెహ్తీ కమిటీ తీవ్రంగా ఆరోపించింది. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.
దశాబ్దాలుగా బలూచ్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక, సామాజిక, రాజకీయ అణచివేతను ఎదుర్కొంటున్నారని స్థానిక సంఘాలు చెబుతున్నాయి. బలూచిస్తాన్‌లోని గ్వాదర్, మక్రాన్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సరిహద్దు వ్యాపారం, చిన్న స్థాయి ఇంధన విక్రయం, సరుకు రవాణా వంటి జీవనాధారాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలు ఈ కార్యకలాపాలను తరచుగా అక్రమంగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల గ్వాదర్ ప్రాంతంలోని మోచెన్ కపర్ మరియు కుంటాని ప్రాంతాల్లో ప్రజలు నిల్వ ఉంచుకున్న ఇంధనాన్ని ప్రభుత్వానికి చెందిన భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని కాల్చివేశారని సమాచారం. ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన బలూచ్ ప్రజలకు ఇది తీవ్రమైన దెబ్బగా మారిందని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై బలూచ్ యక్జెహ్తీ కమిటీ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. బలూచ్ ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతోందని కమిటీ ఆరోపించింది. కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని కూడా డిమాండ్ చేసింది.
బలూచ్ ప్రాంతంలో నివసించే ప్రజలకు విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఉపాధి వంటి ప్రాథమిక సౌకర్యాలు సరైన స్థాయిలో అందడం లేదని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు చిన్నచిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం వాటినే నేరాలుగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బలూచ్ యక్జెహ్తీ కమిటీ ప్రకారం.. ప్రతి చిన్న జీవన ప్రయత్నాన్ని కూడా అక్రమంగా ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ ప్రజలను వలస పాలనలో ఉన్నట్లుగా చూస్తోందని పేర్కొంది. ఇంధనాన్ని కాల్చివేయడం వంటి చర్యలు వారి ఆర్థిక హక్కులను మాత్రమే కాకుండా మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది.
బలూచిస్తాన్ ప్రాంతంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వివాదం మళ్లీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. బలూచ్ ప్రజలపై జరుగుతున్న అణచివేతకు ఇది మరో ఉదాహరణగా నిలిచిందని పలు మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బలూచ్ ప్రజలకు న్యాయం జరిగేలా అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని బలూచ్ నాయకులు కోరుతున్నారు.
