Begin typing your search above and press return to search.

భారీ యుద్ధానికి రంగం సిద్ధం!... కొత్త దేశం ఏర్పడుతుందా?

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య, పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు నెలకొంటున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   30 Oct 2025 10:19 AM IST
భారీ యుద్ధానికి రంగం సిద్ధం!... కొత్త దేశం ఏర్పడుతుందా?
X

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య, పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి పలు దేశాల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ జరిగినా.. ఆయా సరిహద్దులు మాత్రం నిత్యం నివురుగప్పిన నిప్పులా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల ముగిసినట్లే ముగిసిన ఓ యుద్ధం మరోసారి మొదలవ్వబోతోందని అంటున్నారు. అదే పాకిస్థాన్ - ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధం!

అవును... అఫ్గనిస్థాన్‌-పాకిస్థాన్‌ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే... టర్కీ, ఖతార్ కల్పించుకుని మధ్యవర్తిత్వం చేయడంతో కొన్ని రోజులు కాల్పుల విరమణ జరిగింది. అయితే తాజాగా టర్కీ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ దేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

శాంతి చర్చలు విఫలం!:

సరిహద్దుల్లో కాల్పుల విరమణ, సీమాంతర ఉగ్రవాదం, మొదలైన అంశాలపై ఈ రెండు దేశాల మధ్య శనివారం టర్కీ వేదికగా చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇవి విఫలమైనట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన పాక్‌ సమాచార, ప్రసారశాఖమంత్రి అతావుల్లా తరార్‌.. చర్చల్లో ఎలాంటి పరిష్కారమూ కనుగొనలేకపోయినట్లు తెలిపారు.

భారత్ పై పడి పాక్ ఏడుపు!:

ఇటీవల ఢిల్లీ - కాబూల్ మధ్య బంధం మరింత బలపడుతున్న వేళ పాకిస్థాన్ కడుపు తెగ మండిపోతుందనే చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీ చెప్పినట్లుగా కాబూల్ ఆడుతుందని.. వారి తరుపున తాలిబన్లు తమపై ఫ్రాక్సీ యుద్ధం చేసున్నారని పాక్ ఆరోపించింది. ఈ క్రమంలో తాజాగా శాంతి చర్చలు విఫలమవ్వడంతో మరోసారి భారత్ పై ఏడుపు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా... కాబుల్‌ తో చర్చలు విఫలమవ్వడానికి భారత్‌ కారణమని పాక్‌ రక్షణ మంతి ఆసిఫ్‌ ఖవాజా ఆరోపించారు. ఈ సందర్భంగా... భారత్‌ చేతిలో తాలిబన్లు కీలుబొమ్మలుగా మారారంటూ విమర్శలు చేశారు. కాబుల్‌ తో ఒప్పందానికి దగ్గరవుతున్నప్పుడల్లా, కొందరు జోక్యం కారణంగా చర్చలు విఫలమవుతున్నాయని పరోక్షంగా భారత్‌ పై విమర్శలు చేశారు.

బలుస్థాన్ పై పాక్ వైమానిక దాడులు!

బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) లక్ష్యంగా పాకిస్థాన్ మంగళవారం అర్ధరాత్రి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌ లోని చిల్తాన్‌ పర్వత ప్రాంతంలో బీఎల్ఏ ఉగ్రవాదులే లక్ష్యంగా పాక్‌ బలగాలు కచ్చితమైన వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజా దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన అనేక తాత్కాలిక రహస్య స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నట్లు సమాచారం!

స్వతంత్ర దేశంగా బలుస్థాన్..!:

కొంతకాలంగా తమ భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఏడాది మే నెలలో స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బలూచిస్తాన్ రచయిత మీర్ యార్ బలూచ్.. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఇదే సమయంలో... న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

అయితే తదుపరి పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆ ప్రాంతం పాక్ సైన్యం చేతుల్లోకి వెళ్లిన పరిస్థితి! ఈ నేపథ్యంలో ఓ పక్క ఆఫ్గాన్ తో మళ్లీ యుద్ధం మొదలవ్వొచ్చనే ఊహాగాణాలు.. మరోపక్క ఆఫ్గన్ కు భారత్ పరోక్ష మద్దతు ఉందనే పాక్ అనుమానాలు కమ్ భయాల నేపథ్యంలో... కాబుల్ – ఇస్లామాబాద్ మధ్య యుద్ధం అనివార్యమైతే.. ఈ గ్యాప్ లో బలుచిస్థాన్ నుంచి పాక్ పై తీవ్రమైన దాడులు ఉండొచ్చని అంటున్నారు.

సందట్లో సడేమియాలాగా... పాక్ – ఆఫ్గాన్ మధ్య యుద్ధం తీవ్రమైతే ఆ గ్యాప్ లో బీఎల్ఏ.. తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కనబరిచే అవకాశం ఉందని.. తమ దేశాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు! అదే జరిగితే... ఈ ప్రపంచ పటంపై కొత్త దేశం అధికారికంగా ఏర్పడినట్లే!

కాగా... కోటిన్నర జనాభా ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్.. దీర్ఘకాలంగా స్వాతంత్ర్య ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల ఉల్లంఘన, పాక్ సైన్యం చేస్తున్న అణచివేతలపై బలూచ్ ప్రజలు దశాబ్ధ కాలంగా ఆందోళన చేస్తున్నారు! అయితే వారి కోరిక పాక్ – ఆఫ్గన్ యుద్ధ సమయంలో తీరే అవకాశం ఉందని అంటున్నారు!