ఢాకాకు క్యూ కడుతున్న పాక్ పెద్దలు.. ఆ ప్రయత్నం కోసమేనా..!
అవును... ఈ ఏడాది సెప్టెంబర్ లో సౌదీ అరేబియా అణ్వాయుధ పాకిస్థాన్ తో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (ఎస్ఎండీఏ)పై సంతకం చేసింది.
By: Raja Ch | 24 Dec 2025 7:00 AM ISTగత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక మాటలు, చేష్టలు పెరుగుతున్న నేపథ్యంలో.. పైగా వచ్చే ఏడాది ఆ దేశంలో జరగనున్న ఎన్నికల్లో భారత్ ప్రభావం చూపించే అవకాశం ఉందని పలువురు సందేహ పడుతున్నారని అంటున్న తరుణంలో.. భారత్ - బంగ్లాదేశ్ మధ్య మంటల్లో చలి కాచుకోవాలని.. బంగ్లాదేశ్ కు ఇంధనం అందించాలని.. ఈ గ్యాప్ లో భారత్ పై తమ అక్కసు తీర్చుకోవాలని పాక్ ఉత్సాహంగా ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది!
అవును... ఈ ఏడాది సెప్టెంబర్ లో సౌదీ అరేబియా అణ్వాయుధ పాకిస్థాన్ తో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (ఎస్ఎండీఏ)పై సంతకం చేసింది. ఇందులో ప్రధానంగా పేర్కొన్న అంశం.. ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపైనా జరిగిన దాడిగా పరిగణించబడుతుంది అని.. ఇది ఆసక్తిగా మారడంతో పాటు.. భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ వ్యూహాత్మక అడుగుగా చెబుతున్నారు. మే లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బ ఎఫెక్ట్ ఇది అని అంటుంటారు.
ఈ ఒప్పందంలో.. ఉమ్మడి సైనిక విన్యాసాలు, నిఘా సమాచారం పంచుకోవడం, శాశ్వత సైనిక సమన్వయం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో.. భారతదేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ తోనూ ఇలాంటి రక్షణ ఒప్పందం చేసుకోవడంపై పాకిస్థాన్ దృష్టి సారించిందని.. అందుకు యూనస్ కూడా సానుకూలంగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఎన్నికలకంటే ముందే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజా నివేదికల ప్రకారం... పాకిస్థాన్ లోని అనేకమంది అగ్ర రక్షణ అధికారులు బంగ్లాదేశ్ ను వరుసగా సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్ పర్సన్, నేవీ చీఫ్ నుండి.. ఐఎస్ఐ అధిపతి జనరల్ అసిమ్ మాలిక్ వరకు.. ముహమ్మద్ యూనస్ ను కలవడానికి ఢాకాకు చేరుకుంటున్నారు. భారత్ తో ఉద్రిక్తతల వేళ సౌదీ అరేబియాతో పాక్ చేసుకున్నట్లుగానే ఓ రక్షణ ఒప్పందం ఇస్లామాబాద్ - ఢాకా మధ్య జరగలాని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
ఈ ఒప్పందంపై ఇరు దేశాలూ సంతకాలు చేస్తే... బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇకపై అధికారికంగా నిఘా సమాచారాన్ని పంచుకోవడం ప్రారంభించడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే.. ఈ ఒప్పందంలో అణు సహకారం ఉంటుందా లేదా అనేది అత్యంత కీలకంగా మారింది. ఒక వేళ అదే జరిగితే... అది కచ్చితంగా భారత్ కు ఆందోళన కలిగించే అంశం అవుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నిషేధించబడింది. దీంతో.. తీవ్రవాద జమతే-ఇ-ఇస్లామీ, ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఐఎస్ఐ కు తొత్తుగా ప్రసిద్ధి చెందిన జమాతే కాకుండా.. ఢిల్లీకి ఉన్నంతలో అనుకూలంగా ఉన్న బీ.ఎన్.పీ అధికారంలోకి వస్తుందని భారత్ ఆశిస్తోందని అంటున్నారు. అదే జరిగితే.. పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మధ్య రక్షణ ఒప్పందం నిలిచిపోవచ్చని చెబుతున్నారు.
కాగా... 1971లో బంగ్లాదేశ్ విముక్తికి ముందు ఇదే పాకిస్థాన్ సాయుధ దళాలు జాతి నిర్మూలన చేసి, లక్షలాది మంది బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. నాడు భారత్ పుణ్యామాని బంగ్లాదేశ్ కు విముక్తి దక్కింది. విచిత్రంగా.. ఇప్పుడు అదే పాకిస్థాన్ తో జతకడుతూ, భారత్ కు వ్యతిరేక ఆలోచనలు చేస్తుంది బంగ్లాదేశ్!
