'సేల్స్‌మెన్' అవతారం: ఆర్మీ చీఫ్ మునీర్ పై పాకిస్తాన్ లో సెటైర్లే సెటైర్లు
ఆవామీ నేషనల్ పార్టీ (ANP)కి చెందిన సెనేటర్ అయిమల్ వలీ ఖాన్ పార్లమెంట్‌లో ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు.
By: A.N.Kumar | 2 Oct 2025 2:00 PM ISTపాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన పని ఇప్పుడు స్వదేశంలో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన సందర్భంగా ఆయన ప్రవర్తనపై దేశంలోని రాజకీయ నాయకులు, పౌరులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా మునీర్ ఒక 'సేల్స్‌మెన్' లాగా వ్యవహరించారంటూ విమర్శకులు తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
*ట్రంప్ ముందు 'ఖనిజాల ప్రదర్శన'
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో కలిసి మునీర్ వైట్‌హౌస్‌కి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యేకంగా రూపొందించిన చెక్కపెట్టెను బహుమతిగా ఇచ్చారు. ఆ పెట్టెలో పాకిస్థాన్‌లో లభించే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ (అరుదైన భూ ఖనిజాలు) ఉన్నాయి.
వైట్‌హౌస్ విడుదల చేసిన ఫొటోల ప్రకారం, జనరల్ మునీర్ స్వయంగా ఆ ఖనిజాలను ట్రంప్‌కు చూపుతూ, వాటి విలువ గురించి వివరంగా వివరిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ మొత్తం సన్నివేశంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ పక్కనే నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఈ ఫొటోలే ఇప్పుడు పాకిస్థాన్‌లో రచ్చకు ప్రధాన కారణమయ్యాయి.
"ఆర్మీ చీఫ్ సేల్స్‌మెన్‌గా, ప్రధాని మేనేజర్‌గా!": సెనేటర్ తీవ్ర విమర్శ
ఆవామీ నేషనల్ పార్టీ (ANP)కి చెందిన సెనేటర్ అయిమల్ వలీ ఖాన్ పార్లమెంట్‌లో ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. "మన ఆర్మీ చీఫ్ రేర్ ఎర్త్ మినరల్స్‌తో నిండిన బ్రీఫ్‌కేస్ పట్టుకొని తిరుగుతున్నారు. ట్రంప్‌కు వాటిని చూపిస్తూ అచ్చం సేల్స్‌మెన్‌లా ప్రవర్తించారు. ఇక మన ప్రధాని మాత్రం మేనేజర్‌లా పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు" అంటూ అయిమల్ వలీ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు.
"ఇది ప్రజాస్వామ్యం కాదు, డిక్టేటర్‌షిప్‌లా ఉంది. ఈ చర్య ద్వారా దేశ ప్రతిష్టను మునీర్ తక్కువ చేసి చూపారు" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్ ఒక అంతర్జాతీయ వేదికపై దేశ ఆర్థిక వనరులను ప్రదర్శించడం, వాటి గురించి వివరించడం... ఆయన అధికార పరిధికి మించి వ్యవహరించడమేనని విమర్శకులు అంటున్నారు.
మునీర్ సమర్థన : రుణభారం తగ్గింపుపై దృష్టి
వివాదం ముదురుతుండగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తన చర్యను సమర్థించుకున్నారు. "పాకిస్థాన్ వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ అనే ఖజానా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే దేశ రుణభారం తగ్గిపోతుంది. పాక్ చాలా త్వరలోనే సుసంపన్న దేశాల జాబితాలో చేరుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను ఈ అంశాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తానని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
దేశ ప్రతిష్టకే మచ్చ?
మునీర్ వ్యాఖ్యలు ఆర్థికంగా ఆశావహంగా ఉన్నప్పటికీ, ఆయన ప్రవర్తనపైనే స్వదేశంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యున్నత సైనిక నాయకుడు, ప్రభుత్వాధినేత సమక్షంలో, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లా ఖనిజాల విలువను విదేశీ నాయకుడికి చెప్పడం పాకిస్థాన్ అంతర్జాతీయ గౌరవాన్ని దిగజార్చిందనే అభిప్రాయం బలంగా ఉంది.
ప్రధాని షరీఫ్ సైతం నిశ్శబ్దంగా కూర్చోవడం, ఆర్మీ చీఫ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం దేశంలో సైనిక జోక్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్మీ ఆధిపత్యాన్ని మరోసారి ఎత్తిచూపుతోందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఈ 'ఖనిజాల ఎగ్జిబిషన్'పై రాజకీయ నాయకులు, పౌరుల నుంచి వస్తున్న బలమైన నిరసనతో జనరల్ మునీర్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
