కాబూల్ లో కప్పు టీ ఎంత ఖరీదైందో చెప్పిన పాక్ మంత్రి.. మళ్లీ తాగరంట!
వాస్తవానికి ఆఫ్గనిస్థాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు 2021లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 6 Nov 2025 4:00 PM ISTప్రస్తుతం పాకిస్థాన్ - అఫ్గనిస్థాన్ మధ్య పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది తెలిసిన విషయమే. టర్కీ, ఖతార్ లు ప్రస్తుతం ఈ ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి సక్సెస్ కాకపొతే యుద్ధం తప్పదని పాక్ రక్షణ మంత్రి వెల్లడించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాబూల్ లో కప్పు టీ తమకు ఎంత ఖరీదైదో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాక్ ఉప ప్రధాని.
అవును... ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఒక కప్పు టీ పాకిస్థాన్ కు ఎంత ఖరీదైన తప్పిందంగా మారిందనేది పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పుకొస్తున్నారు. అలాంటి తప్పు ఇకపై ఎప్పటికీ పునరావృతం కాకూడదని ఆయన నొక్కి చెబుతున్నారు. ఆ కప్పు టీ సాకుతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు తన సరిహద్దులను తెరిచిందని.. అది తీవ్ర ప్రభావాన్ని చూపించిందని అన్నారు.
వాస్తవానికి ఆఫ్గనిస్థాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు 2021లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది ఐ.ఎస్.ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్, అఫ్గానిస్థాన్ లో పర్యటించారు. ఆ పర్యటనకు సంబంధించిన ఒక సమావేశంలో హమీద్ టీ తాగుతూ కనిపించారు. దానిని ఉద్దేశించే ఇషాక్ దార్ ఈ విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ కప్పు టీ తమకు ఎంతో నష్టాన్ని కలిగించిందని ఇస్సాక్ దార్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా... ఆ టీ తర్వాత తాము తమ దేశ సరిహద్దులు తెరిచామని.. దీంతో, సుమారు 35 వేల నుంచి 40 వేల మంది తాలిబన్లు పాకిస్థాన్ లోకి చొరబడ్డారని అన్నారు.
ఆ భేటీ తర్వాత పాకిస్థాన్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కరడుగట్టిన నేరస్థులను కూడా విడుదల చేసిందని విమర్శించారు. అఫ్గాన్ లో హమీద్ భేటీ తర్వాత మిలిటెంట్లకు తలుపులు తెరుచుకున్నాయని, తమ దేశం లోపల ఉగ్రవాదాన్ని రగిలించిందని.. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా నిర్ణయాలపై నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు.
కాగా తాలిబన్లు ఆఫ్గాన్ కు చేజిక్కించుకున్న సమయంలో పాక్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్థాన్ స్వాగతించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ శాంతి చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్నిబట్టి.. తమ ప్రతిస్పందన కూడా తీవ్రస్థాయిలో ఉంటుందని అన్నారు. ఇదే సమయంలో.. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
