Begin typing your search above and press return to search.

అప్ఘనిస్తాన్ పై యుద్ధానికి దిగిన పాకిస్తాన్.. భీకరపోరు

గురువారం రాత్రి జరిగిన పరిణామాలు ఈ ఘర్షణలకు కీలక మలుపు తిప్పాయి. అఫ్గాన్‌ దాడులకు ప్రతిగా పాకిస్థాన్‌ వైమానిక దాడులు ప్రారంభించింది.

By:  A.N.Kumar   |   27 Feb 2026 11:02 AM IST
అప్ఘనిస్తాన్ పై యుద్ధానికి దిగిన పాకిస్తాన్.. భీకరపోరు
X

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో రోజులుగా కొనసాగుతున్న కాల్పులు.. వైమానిక దాడులు ఇప్పుడు బహిరంగ యుద్ధానికి దారితీసే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను మరింత పెంచాయి. “మా సహనం ముగిసింది.. ఇక మిగిలింది యుద్ధమే” అంటూ అఫ్గానిస్థాన్‌పై బహిరంగ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.

గురువారం రాత్రి జరిగిన పరిణామాలు ఈ ఘర్షణలకు కీలక మలుపు తిప్పాయి. అఫ్గాన్‌ దాడులకు ప్రతిగా పాకిస్థాన్‌ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌కు “ఆపరేషన్ గజబ్ లిల్ హక్” అని పేరు పెట్టినట్లు పాక్‌ సైనిక వర్గాలు వెల్లడించాయి. కాబుల్‌, కాందహార్‌, పక్తియా వంటి ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని తాలిబన్‌ ప్రతినిధులు తెలిపారు. కాబుల్‌లో మూడు భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం సంభవించలేదని అఫ్గాన్‌ అధికారులు వెల్లడించడం విశేషం.

ఇక అఫ్గానిస్థాన్‌ మాత్రం పాకిస్థాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. తమపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్‌పై భారీ దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన 55 మంది సైనికులు మరణించారని అఫ్గాన్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రకటనలను ఇస్లామాబాద్‌ పూర్తిగా ఖండించింది. తమకు చెందిన ఇద్దరు సైనికులు మాత్రమే మృతి చెందారని, ముగ్గురు గాయపడ్డారని పాక్‌ అధికార ప్రతినిధులు తెలిపారు.

ఇదే సమయంలో పాకిస్థాన్‌ మరో కీలక ప్రకటన చేసింది. అఫ్గాన్‌ సైనికుల్లో 133 మంది మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. అంతేకాకుండా తొమ్మిది మంది అఫ్గాన్‌ సైనికులను నిర్బంధించినట్లు వెల్లడించింది. ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ నష్టాలను ప్రకటించుకుంటుండటం గమనార్హం. నిజమైన నష్టం ఎంత అన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా ఘర్షణ తీవ్రత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

–పాకిస్తాన్ ఎఫ్ 16 కూల్చేశాం : అప్ఘన్ ప్రకటన

ఇదిలా ఉండగా అఫ్గానిస్థాన్‌ మరో సంచలన ప్రకటన చేసింది. తమ గగనతలంలోకి చొరబడ్డ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని పేర్కొంది. ఈ మేరకు అక్కడి మీడియా నివేదికలు వచ్చాయి. కాలిపోతున్న యుద్ధ విమానం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఈ సంఘటన నిజమైతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా స్పందించారు. అఫ్గాన్‌ దాడులకు తమ సైన్యం సమర్థంగా ఎదురుదాడి చేస్తోందని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో తమ సైన్యం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక ఈ వ్యవహారంలో భారత్‌ పేరును లాగడం మరో కీలక పరిణామంగా మారింది. పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అఫ్గానిస్థాన్‌ భారత్‌ ప్రభావంలో ఉందని.. భారత ప్రతినిధిలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. తాలిబన్లు ప్రపంచంలోని ఉగ్రవాదులను సమీకరిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రాంతీయ శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై భారత్‌ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

మొత్తంగా చూస్తే పాక్‌-, అఫ్గాన్‌ మధ్య పరిస్థితి అత్యంత సున్నిత దశలోకి ప్రవేశించింది. సరిహద్దు ఘర్షణలు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకొని ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దక్షిణాసియా ప్రాంత భద్రతపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.