కొత్త ఏడుపు... ఆఫ్గాన్ భుజంపై భారత్ తుపాకీ!
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు దిమ్మతిరిగిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 16 Oct 2025 11:31 AM ISTపాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో అనేక మంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడటం, నిరాశ్రయులవ్వడం జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో అటు తిరిగి ఇటు తిరిగి భారత్ పై పడి ఏడ్చే పనికి మరోసారి పూనుకుంది పాక్.
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు దిమ్మతిరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. సీజ్ ఫైర్ వ్యవహారానికి తెరలేపింది. ఇదే సమయంలో తాజాగా ఆఫ్గాన్ తోనూ సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుంది. ఇది బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు కొనసాగనుంది. ఈ క్రమంలో తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.
ఆఫ్గాన్ భుజంపై భారత్ తుపాకీ!:
ఆఫ్గాన్ – పాక్ మధ్య 48 గంటల సీజ్ ఫైర్ ప్రకటన అనంతరం స్పందించిన పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్... అఫ్గాన్ లో భారీగా దాడులు జరిగాయని.. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారని చెబుతూ.. కానీ అది పేలవంగా ఉందని.. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదని అన్నారు. ఇదే సమయంలో.. ఆఫ్గాన్ నిర్ణయాలు కాబూల్ లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ముత్తాఖీ పర్యటనపైనా అక్కసు!:
మరోవైపు... అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా పాక్ మంత్రి అక్కసు వెళ్లగక్కారు. ఇందులో భాగంగా... ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందని అన్నారు. ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ అఫ్గాన్ కు హెచ్చరికలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే... భారత్ తరుపున పాక్ పై ఆఫ్గాన్ పరోక్ష యుద్ధం చేస్తుందనేది ఆసిఫ్ వాదన!
భర్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు..!:
దీంతో... భర్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా పాకిస్థాన్ మంత్రి వైఖరి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓ పక్క పాక్ సైన్యాన్ని ఆఫ్గాన్ యోధులు కుల్లబొడిచేస్తున్నారు.. పాక్ సైనికుల దుస్తులు రోడ్లపై వేళాడదీస్తున్నారు.. యుద్ధ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని రోడ్లపై ర్యాలీలు తీస్తూ వారి సత్తా చాటుతున్నారు.
ఈ సమయంలో ఆఫ్గాన్ పై తమ అక్కసు వెల్లగక్కాలి.. ఓపిక ఉంటే ఎదురెళ్లి పోరాడాలి.. ఓపిక లేకపోతే సీజ్ ఫైర్ కు రిక్వస్ట్ పెట్టుకున్నట్లు ఉండాలి.. అంతే కానీ, భారత్ పై పడి ఏడ్వడమెందుకు ఆసిఫ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఐక్యరాజ్యసమితి పిలుపు!:
ఈ సందర్భంగా... మరింత ఉద్రిక్తతలను నివారించాలని ఐక్యరాజ్యసమితి ఇరు దేశాలను కోరింది. ఇదే సమయంలో... ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య పరిస్థితిని తాము ఆందోళనతో పర్యవేక్షిస్తున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. ఇదే సమయంలో... చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం ఆయన పిలుపునిచ్చారు.
