Begin typing your search above and press return to search.

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ కటీఫ్... తదుపరి అడుగు ఏంటి?

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల పరంపర నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.

By:  A.N.Kumar   |   14 Oct 2025 12:37 PM IST
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ కటీఫ్... తదుపరి అడుగు ఏంటి?
X

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల పరంపర నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించడం, ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక సంబంధాలు పూర్తిగా నిలిచిపోయినట్లు సంకేతాలిచ్చింది.

* ఆసిఫ్ వ్యాఖ్యలు: సంబంధాల తెగింపు

ఒక వార్తా సంస్థ కార్యక్రమంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొందని స్పష్టం చేశారు. "శత్రుత్వాలు లేవని చెప్పినా, ప్రస్తుత పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు" అని పేర్కొన్నారు. ఇది రెండు దేశాల మధ్య శత్రుత్వం తిరిగి ప్రారంభమవుతుందనే సంకేతాలను కూడా ఇచ్చింది.

చర్చలపై ప్రశ్నించగా "బెదిరింపులతో కూడిన చర్చలు సరికావు. మొదట ఆ బెదిరింపులను ఎదుర్కొన్న తరువాతే చర్చలు సాధ్యమవుతాయి" అని ఆసిఫ్ దృఢంగా చెప్పారు. పాక్ సైన్యం చేపట్టిన ప్రతిదాడిని సమర్థిస్తూ, "మేము పౌరులను లేదా వారి నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిపాం" అని వివరించారు.

అఫ్గానిస్థాన్‌ పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వలీ మోహ్సూద్ ఆఫ్ఘన్ భూభాగంలోనే ఉన్నారని తెలిపారు. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు నిజాయతీ, సహకారం అవసరమని ఆసిఫ్ సూచించారు.

*ఆఫ్ఘన్ స్పందన: పాక్ మినహా అందరితో సత్సంబంధాలు

తాజా ఉద్రిక్తతలపై ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ స్పందించారు. పాకిస్తాన్ తప్ప మిగతా పొరుగుదేశాలన్నీ తమతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. "మాకు ఎవరితోనూ గొడవలు అక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొంది. పాక్ ఒక్కటే మా పొరుగుదేశం కాదు, మరో ఐదు దేశాలు ఉన్నాయి. అవన్నీ మా స్నేహిత దేశాలే" అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలా కనిపిస్తున్నాయి.

* బాలికల విద్యపై జావేద్ అక్తర్ ఆగ్రహం

ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారతదేశ పర్యటనపై ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. "బాలికల విద్యను నిషేధించిన ప్రభుత్వానికి చెందిన వ్యక్తిని భారతదేశం గౌరవప్రదంగా ఆహ్వానించడం సిగ్గుచేటు. నేను ఒక భారతీయుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నాను" అని ఆయన ఎక్స్‌లో (మాజీ ట్విట్టర్) పేర్కొన్నారు.

* భవిష్యత్ దిశ: మలుపు తిరుగుతుందా? సర్దుబాటు అవుతుందా?

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఘర్షణలు, దౌత్య సంబంధాల తెగింపు ప్రకటనతో ఇరుదేశాల సంబంధాలు కొత్త దిశగా మలుపు తిరుగుతాయా? లేదా కాలక్రమేణా మళ్లీ సర్దుబాటు దిశగా సాగుతాయా? అనేది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నప్పటికీ, అంతిమంగా రెండు దేశాల భద్రత, స్థిరత్వం ఇక్కడి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.