Begin typing your search above and press return to search.

పహల్గాంకు రైలు... స్థానికుల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత..!

అవును... బిజ్‌ బెహారా నుండి పహల్గాం పర్యాటక స్థలానికి ప్రతిపాదిత రైల్వే లైన్ వ్యవహారం ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.

By:  Raja Ch   |   27 Jan 2026 3:00 PM IST
పహల్గాంకు రైలు... స్థానికుల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత..!
X

గత ఏడాది పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ సంగతి అలా ఉంటే.. బిజ్‌ బెహారా నుండి పహల్గాం పర్యాటక స్థలానికి ప్రతిపాదిత రైల్వే లైన్ జమ్మూ కాశ్మీర్‌ లో వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజానికంతో పాటు రాజకీయ నాయకులు ఈ రైల్వే లైన్ ను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై నిరసనలు మొదలయ్యాయి. దీనిపై ప్రధానంగా రైతులు నిరసన తెలుపుతున్నారని అంటున్నారు!

అవును... బిజ్‌ బెహారా నుండి పహల్గాం పర్యాటక స్థలానికి ప్రతిపాదిత రైల్వే లైన్ వ్యవహారం ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో... ఈ ప్రాజెక్టు తమ విస్తారమైన వ్యవసాయం, ఆపిల్ తోటల భూములను దోచుకుంటుందని.. తమ జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వీరి నిరసనల్లోకి స్థానిక రాజకీయ ప్రముఖులు చేరారు. ఈ సందర్భంగా ఈ రైల్వే లైన్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు.

ఈ సందర్భంగా... అనంత్‌ నాగ్ - పూంచ్ ఎంపీ మియాన్ అల్తాఫ్ స్థానిక నివాసితులను కలిశారు. అనంతరం మాట్లాడుతూ... స్థానిక నివాసితుల ఆపిల్ తోటలు, వ్యవసాయ భూములు ప్రతిపాదిత రైల్వే అలైన్‌ మెంట్ వెంట ఉన్నాయని.. ఈ రైల్వే లైన్ ఎవరికీ ప్రయోజనం కలిగించదని.. ఇది కేంద్ర ప్రభుత్వానికి, జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వానికి లేదా జమ్మూ & కశ్మీర్ ప్రజలకు ప్రయోజనం కలిగించదని.. ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేయాలని అన్నారు.

ఇదే సమయంలో... బిజ్‌ బెహారాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సీ) ఎమ్మెల్యే బషీర్ అహ్మద్ స్పందిస్తూ... ఈ ప్రాజెక్టును తప్పుడు ఆలోచనతో కూడినదని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైనదని అభివర్ణించారు. ఇదే సమయంలో.. ఇటు పహల్గాంకు చెందిన ఎన్.సీ ఎమ్మెల్యే అల్తాఫ్ అహ్మద్ కలూ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తపరుస్తూ.. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రశ్నించారు. ఇప్పటికే జాతీయ రహదారి-501 మంజూరు చేయబడిందని.. రైల్వే లైన్ అవసరం లేదని అంటున్నారు!

ఈ క్రమంలోనే... పహల్గాంకు ఇప్పటికే ఒక రహదారి ఉందని.. సమాంతర రహదారిని నేషనల్ హైవే-501గా ప్రకటించారని.. ఇప్పటికే ఎన్.హెచ్-501 కోసం గణనీయమైన భాగాన్ని సేకరించారని.. ఈ పరిస్థితుల్లో మరో 40-కి.మీ. జిగ్ జాగ్ రైల్వే లైన్ అవసరం ఏమిటని ప్రశ్నించారు. త్వరలో నిర్మించనున్న హైవే ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే భూములు పెద్ద ఎత్తున తీసుకోబడ్డాయని.. ఈ సమయంలో మళ్లీ రైల్వే లైన్ కోసం భూములు ఇవ్వడం జరగదని చెబుతున్నారు!

అదేవిధంగా... ఆ ప్రాంతాన్ని సందర్శించిన పీడీపీ కార్యకర్త ఇల్టిజా ముఫ్తీ మాట్లాడుతూ... వందలాది కెనాల్‌ ల సారవంతమైన వ్యవసాయ, ఉద్యానవన భూములు, నివాస గృహాలను కలుపుతూ రైల్వే లైన్ ఏర్పాటు చేయడం తప్పుడు ఆలోచన అని.. ఇది హానికరం అని.. ముఖ్యంగా పర్యావరణపరంగా లాభదాయకం కాదని అన్నారు. ఈ ప్రణాళికను పూర్తిగా రద్దు చేయాలని ఆమె కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు విజ్ఞప్తి చేశారు.