మండలి చైర్మన్‌ను తాడేపల్లి పెద్దలు నడిపిస్తున్నారా?: పద్మశ్రీ
ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజుపై వైసీపీ మాజీ నాయకురాలు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కర్రి పద్మశ్రీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
By: Garuda Media | 4 Dec 2025 8:45 AM ISTఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజుపై వైసీపీ మాజీ నాయకురాలు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కర్రి పద్మశ్రీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మండలి చైర్మన్ ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగం.. నిబంధనలు.. పద్ధతులు వంటివి ఆయనకు వర్తించవా? అని నిలదీశారు. కోర్టు ఆదేశాలను కూడా ఆయన తృణీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చాలా నెలలు అయిపోయిందని.. అయినా ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదని చెప్పారు.
హైకోర్టు ఆదేశాల మేరకు.. మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఆయన రాజీనామాల విషయంలో రాజీ పడే ధోరణితో వ్యవహరిస్తున్నారని పద్మశ్రీ ఆరోపించారు. తమ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారని చెప్పారు. తాముఅన్నీ ఆలోచించే రాజీనామాలు చేశామని, అయినా వేధించాలన్న ఉద్దేశంతోనే మండలి చైర్మన్ వాటిపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు. ఎవరి ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్నారని ప్రశ్నించారు. తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారా? అని నిలదీశారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మోషేన్ రాజు.. ఆ విధంగా వ్యవహరించడం లేదని పద్మశ్రీ అన్నారు. తన రాజీనామాను ఆమోదించకపోతే.. న్యాయ పోరాటం చేస్తానని ఆమె హెచ్చరించారు. రాజీనామాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని(వాస్తవానికి 4 వారాలు గడువు ఉంది) కోర్టు ఆదేశించిన విషయం ఆయన మరిచిపోయారా? అని ప్రశ్నిం చారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని.. లేకపోతే న్యాయ పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. ఇదిలావుంటే..వైసీపీ హయాంలో మండలికి నామినేట్ అయిన పద్మశ్రీ తర్వాత.. ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆవెంటనే మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
