చేతులు కాల్చుకుని.. క్షమాపణలా.. కౌశిక్ రెడ్డీ!
బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తారన్న పేరున్న పాడి కౌశిక్ రెడ్డి తాజాగా పోలీసులకు క్షమాపణలు చెప్పారు
By: Garuda Media | 30 Jan 2026 11:44 PM ISTబీఆర్ ఎస్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తారన్న పేరున్న పాడి కౌశిక్ రెడ్డి తాజాగా పోలీసులకు క్షమాపణలు చెప్పారు. గతంలోనూ పోలీసులపై ఆయన దూకుడుగా వ్యవహరించారు. దీంతో పలు కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా మేడారం జాతరకు సంబంధించి పోలీసులు తనను అనుమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాడి.. వారి అంతు చూస్తామని.. తమ ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనికి తోడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దీంతో విద్వేషాలు రెచ్చగొట్టడం, విధుల్లో ఉన్న పోలీసుల ను అడ్డుకోవడం.. వంటి కీలక కేసులు నమోదయ్యాయి.
అయితే.. ఈ పరిణామాలతో మరింత ఉచ్చు బిగిసుకుంటుందన్న ఆలోచనతో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి.. వెంటనే పోలీసులకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు పోలీసులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. పోలీసులంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే.. పవిత్రమైన సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న సమయంలో తనను అడ్డుకోవడంతోనే నోరు జారానని వ్యాఖ్యానించారు. అయితే.. కౌశిక్ రెడ్డి గత ఏడాదిన్నర కాలంలో అనేక వివాదాలకు కేంద్రంగా మారారన్నది వాస్తవం. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. గాంధీ పార్టీ మారారని.. ఆయనకు పదవి కూడా ఇచ్చారని ఆరోపిస్తూ.. గత ఏడాది యాగీ చేశారు.
ఇది పెను దుమారానికి దారి తీసింది. దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆ సమయంలోనూ పోలీసులపై పాడి తీవ్ర విమర్శ లు చేశారు. దీంతో అప్పట్లోనూ కేసు నమోదైంది. కేసీఆర్‌కు గతంలో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని కూడా పాడి తప్పుబట్టారు. అప్పట్లోనూ ధర్నా పేరుతో నిరసన వ్యక్తం చేసి.. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. ఇటు పార్టీని వెనుకేసుకు వస్తున్నానన్న కారణాన్ని చూపి.. తన దూకుడును ఆయన పెంచుతున్నారు. కానీ, ఇది పార్టీకి, వ్యక్తిగతంలో కౌశిక్‌రెడ్డికి కూడా ఇబ్బందులు తెస్తున్నాయి.
తాజా పరిణామంలో కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్‌తో కొబ్బరికాయ కొట్టనివ్వలేదన్న ఘటనతో ప్రారంభమైన వివాదం.. పోలీసులపై దురుసుగా నోరు చేసుకునే వరకు సాగింది. అప్పటికీ పోలీసులు ఆయనకు నచ్చజెప్పారు. హైకోర్టు ఉత్తర్వులు కూడా చూపించారు. అయినా.. కౌశిక్ రెడ్డి తన పట్టును సాధించుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరో వివాదంలో చిక్కుకున్నారు. కానీ, ఆయన క్షమాపణలు చెప్పినా.. ఇప్పటికే కేసులు నమోదయ్యాయని.. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
