ఆపరేషన్ బ్లూ స్టార్.. ఇందిరాగాంధీ చేసిన అతిపెద్ద పొరపాటు అదే
మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో జరిగిన 'ఆపరేషన్ బ్లూ స్టార్' నిర్ణయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చరిత్రలోని ఒక సున్నితమైన అంశాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.
By: A.N.Kumar | 12 Oct 2025 8:34 PM ISTహిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో జరిగిన 'ఆపరేషన్ బ్లూ స్టార్' నిర్ణయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చరిత్రలోని ఒక సున్నితమైన అంశాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.
*ఆపరేషన్ బ్లూ స్టార్: అసలు పొరపాటు ఏంటి?
చిదంబరం తమ వ్యాఖ్యల్లో 1984 జూన్‌లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయం నుండి మిలిటెంట్లను బయటకు పంపడానికి తీసుకున్న సైనిక చర్య 'తప్పుడు మార్గం' అని స్పష్టం చేశారు. "స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, మిలిటెంట్లను పట్టుకోవడానికి మరో మార్గం ఉంది. కానీ ఆపరేషన్ బ్లూ స్టార్‌తో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు" అని చిదంబరం అభిప్రాయపడ్డారు. "ఆ పొరపాటుకు ఇందిరా గాంధీ తన ప్రాణాలను కోల్పాయారని నేను అంగీకరిస్తున్నా," అంటూ ఆ నిర్ణయం యొక్క తీవ్ర పరిణామాన్ని నొక్కి చెప్పారు.
దేవాలయాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో సైన్యాన్ని దూరంగా ఉంచాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి భిన్నంగా, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ఆపరేషన్ బ్లాక్ థండర్ లో ఆర్మీని దూరంగా ఉంచడం ద్వారా సరైన మార్గం చూపించబడిందని ఆయన పోల్చి చెప్పారు.
* ఇందిరా గాంధీ ఒక్కరిదే పొరపాటు కాదన్న చిదంబరం
ఆ నిర్ణయాన్ని పూర్తిగా ఇందిరా గాంధీకే ఆపాదించడం సరికాదని చిదంబరం స్పష్టం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్ణయం కేవలం ఇందిరా గాంధీ వ్యక్తిగత నిర్ణయం కాదని, అది సైన్యం, పోలీసులు, నిఘా సంస్థలు.. పౌర పరిపాలనా వ్యవస్థల సమిష్టి నిర్ణయం అని ఆయన వివరించారు. "అందులోని బాధ్యతను కేవలం ఇందిరా గాంధీపై మాత్రమే మోపడం సరికాదు" అని ఆయన అన్నారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ నేపథ్యం ఏంటి?
1980ల ప్రారంభంలో పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమం ఉధృతమైంది. వివాదాస్పద సిక్కు నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే తన అనుచరులతో కలిసి అమృత్‌సర్‌లోని పవిత్ర హర్‌మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) కాంప్లెక్స్‌ను స్థావరంగా మార్చుకున్నారు. వేర్పాటువాద కార్యకలాపాలు, హింస పెరగడంతో, 1984 జూన్ 1 నుండి 8 వరకు ఇందిరా గాంధీ ప్రభుత్వం మేజర్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్ ఆధ్వర్యంలో ఈ సైనిక చర్యకు ఆదేశించింది. ఈ చర్యలో భింద్రన్‌వాలే సహా అనేక మంది వేర్పాటువాదులు, సాధారణ పౌరులు మరణించారు. 83 మంది భారత సైనికులు అమరులయ్యారు.
ఇందిరా గాంధీ హత్య
ఈ సంఘటన సిక్కు సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ జరిగిన కొద్ది నెలలకే, 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ తన సొంత సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు.
*చిదంబరం వ్యాఖ్యల ప్రాధాన్యం
కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సీనియర్ నాయకుడిగా, చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ చరిత్రలోని ఒక సున్నితమైన అంశాన్ని అంగీకరించడం ద్వారా, ఆయన ఆనాటి నిర్ణయం యొక్క తీవ్రమైన పరిణామాలను గుర్తు చేశారు. పంజాబ్‌లో ఖలిస్తాన్ వాదన దాదాపు తగ్గిపోయిందని, కానీ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి ప్రధాన సమస్యగా మారిందని కూడా ఆయన పేర్కొన్నారు.
