హవ్వా.. బరువు తగ్గాలని మందులు వాడితే బట్టతల వచ్చేస్తుందట..?
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.. కష్టపడకుండా బరువు తగ్గాలనే మీ తెలివికి, శరీరం భలే రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది.
By: A.N.Kumar | 3 Aug 2026 1:13 AM ISTశ్రమ లేకుండా చమట పట్టకుండా చిటికెలో స్లిమ్ అయిపోవాలని ఉందా? బర్గర్లు, బిర్యానీలు తింటూనే భుజాల మీద బరువు తగ్గించేసుకోవాలని ఆశపడుతున్నారా? మీలాంటి ఐడియాలజీ ఉన్నవాళ్ల కోసమే మార్కెట్లోకి వచ్చాయి ఒజెంపిక్, వెగోవీ , మౌంజారో లాంటి 'మ్యాజిక్ సూదులు'. పొట్ట తగ్గించేస్తాం.. షేప్ మార్చేస్తాం అని బజ్జీల కొట్టు ముందు బోర్డులు పెట్టినట్టు ఈ మందులు ప్రకటనలు గుప్పిస్తుంటే జనాలు కూడా విపరీతంగా వాడేస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.. కష్టపడకుండా బరువు తగ్గాలనే మీ తెలివికి, శరీరం భలే రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది. నిన్నటిదాకా "ఒజెంపిక్ ఫేస్" అని చెప్పి ముఖాన్ని ముసలిదానిలా మార్చేసిన ఈ మందులు.. ఇప్పుడు కొత్తగా "ఒజెంపిక్ హెయిర్" అనే లేటెస్ట్ వర్షన్‌ను మార్కెట్లోకి వదిలాయి.
కథ ఏంటంటే..
ఈ మందులు వేసుకోగానే కడుపులో ఉన్న ఆకలి దేవత కాస్తా మాయమైపోతుంది. తిండి ధ్యాస అసలే ఉండదు. "అబ్బా ఎంత హాయిగా బరువు తగ్గిపోతున్నానో" అని మీరు సంబరపడేలోపే శరీరానికి అందాల్సిన ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు అన్నీ బంద్ అయిపోతాయి. పోషణ లేక కడుపు అలమటించిపోతుంటే "నాకెందుకు వచ్చిన గోల" అని తలలోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా లగేజ్ సర్దేసి గుడ్‌బై చెప్పేస్తున్నాయి.
వైద్య పరిభాషలో దీనికి టెలోజెన్ ఎఫ్లూవియం అని ఎంత అందమైన పేరు పెట్టినా సింపుల్‌గా చెప్పాలంటే.. అది తాత్కాలిక బట్టతల అన్నమాట.. సైన్స్ ఏం చెప్తోందంటే.. మందు నేరుగా జుట్టును పీకేయడం లేదు.. మీ తొందరపాటు వల్ల విపరీతంగా పెరిగిన పోషకాహార లోపమే మీ జుట్టును ఊడదీస్తోంది!
తగ్గడం ఓకే.. మరి జుట్టు సంగతేంటి?
డాక్టర్ ముఖం చూడకుండా, సొంత వైద్యంతో సన్నబడదాం అనుకుంటే.. సన్నబడటం ఏమో గానీ, తలమీద వెంట్రుకల సంఖ్య మాత్రం బాగా తగ్గిపోతుంది. బరువు తగ్గడం అంటే అన్నం మానెయ్యడం కాదు. ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న సమతుల్య ఆహారం తగినంతగా తింటూ తగ్గాలి. రోజువారీ వ్యాయామం, సరైన డైట్ లేకుండా కేవలం "ఇంజెక్షన్లు పొడుచుకుంటే సన్నబడిపోతాం" అనుకోవడం.. వర్షం రాకుండా గొడుగు పట్టుకుని తిరగడం లాంటిదే..
బరువు తగ్గి రింగ్ మాస్టర్‌లా తిరుగుదాం అనుకుంటే చివరికి తలమీద వెంట్రుకలు లేక కామోడీ గెటప్‌లోకి మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే కాస్త ఓపిక పట్టండి.. డాక్టర్ పర్యవేక్షణలో ప్రశాంతంగా.. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గే ప్రయత్నం చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తండి. గుర్తుంచుకోండి.. సిక్స్ ప్యాక్ బాడీతో పాటు తలపై జుట్టు ఉంటేనే సొగసు..
