Begin typing your search above and press return to search.

ఆక్స్‌ఫర్డ్ MBA చదివి.. కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి..అవోకాడో సాగుతో లక్షల సంపాదన!

లండన్, హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరపడిన ఉన్నత విద్యావంతులు సైతం నేడు సంప్రదాయ కార్పొరేట్ ఉద్యోగాల కంటే కమర్షియల్ హార్టికల్చర్ (వాణిజ్య పండ్ల సాగు) వైపు మొగ్గు చూపుతున్నారు.

By:  Sivaji Kontham   |   3 July 2026 2:57 PM IST
ఆక్స్‌ఫర్డ్ MBA చదివి.. కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి..అవోకాడో సాగుతో లక్షల సంపాదన!
X

లండన్, హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరపడిన ఉన్నత విద్యావంతులు సైతం నేడు సంప్రదాయ కార్పొరేట్ ఉద్యోగాల కంటే కమర్షియల్ హార్టికల్చర్ (వాణిజ్య పండ్ల సాగు) వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సరికొత్త ట్రెండ్ భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా నిల‌బ‌డుతోందా? ఇది కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమయ్యే ఒక తాత్కాలిక ప్రయోగమా? మ‌న‌కు అర్థ‌మ‌వ్వాలంటే ఒక ఉదాహ‌ర‌ణ ఇది. ఏఐ రాక‌తో ఉద్యోగాలు ఊడుతున్న ఈరోజుల్లో చాలామంది టెక్ ఉద్యోగులు ఇలాంటి ప్ర‌త్యామ్నాయాల‌పై ఆలోచిస్తున్నారు.. పూర్తి క‌థ‌నంలోకి వెళితే...

లండన్‌లో ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడే సదవకాశం ఉన్నా.. వాటన్నింటినీ వదిలేసి మళ్లీ మట్టిని నమ్ముకున్నాడు తెలంగాణకు చెందిన రామ్ భూపాల్. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక, లండన్ లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత హీత్రూ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో.. అనంతరం హైదరాబాద్‌లోని ఒక లీడింగ్ రిటైల్ కంపెనీలో కార్పొరేట్ ఉద్యోగం చేశాడు. అయితే ప్రతిరోజూ తొమ్మ‌ది నుంచి 5వ‌ర‌కూ సాగే ఉద్యోగం అత‌డికి విసుగును మిగిల్చింది.. ఆ క్ర‌మంలోనే రంగారెడ్డిలోని సొంత ఊరికి చేరుకుని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

సాధారణ రైతులలాగా కాకుండా.. మార్కెట్ గ్యాప్‌లను అధ్యయనం చేసి వినూత్నంగా ఏదైనా చేయాలనుకున్నాడు భూపాల్. సాంప్రదాయ పంటలు లేదా సాధారణ పండ్ల (మామిడి, జామ) సాగులో ఉన్న మిగులు సరఫరా న‌ష్టాలు.. ధరల పతనాన్ని గమనించిన అతడు విదేశీ పండ్ల వైపు దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో 2013లో ఇజ్రాయెల్ దేశం నుండి ఒక్కో మొక్కను రూ. 1,200 చొప్పున వెచ్చించి 200 హాస్‌ అవోకాడో మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. అయితే స్థానిక వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక ఆ మొదటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.

మొదటి ఓటమితో అధైర్యపడకుండా.. మన వాతావరణ పరిస్థితులకు, అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకునే సరికొత్త రకాలపై మళ్లీ పరిశోధనలు చేశాడు. దాదాపు 1.2 ఎకరాల భూమిలో 250 మొక్కలతో పూర్తి ఆర్గానిక్ (సేంద్రీయ) పద్ధతిలో అవోకాడో సాగును విజయవంతంగా ప్రారంభించాడు. 2023 నాటికి ఈ తోట నుండి మొదటి దిగుబడి ప్రారంభమైంది. ప్రారంభంలో తన స్నేహితుడి ద్వారా కువైట్ దేశానికి ఎగుమతి చేసిన జైపాల్... ఆ తర్వాత దేశీయ మార్కెట్లోనే నేరుగా కస్టమర్లకు విక్రయించడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుండి దాదాపు 20 కేజీల దిగుబడి వస్తోందని... కేజీ రూ. 250 చొప్పున అమ్ముతూ ఏడాదికి రూ. 8 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కేవలం పండ్లను అమ్మడమే కాకుండా.. తన ఎంబీఏ మార్కెటింగ్ తెలివితేటలను ఉపయోగించి భూపాల్ ఒక సమాంతర వ్యాపారాన్ని కూడా సృష్టించుకున్నాడు. తన పొలంలోనే అవోకాడో నర్సరీని ఏర్పాటు చేసి... వేడిని తట్టుకునే `పింకెర్టన్` వంటి ప్రీమియం రకాల మొక్కలను రూ. 300 నుండి రూ. 400 వరకు విక్రయిస్తున్నాడు. ఏడాదికి దాదాపు 5,000 నుండి 10,000 మొక్కలను అమ్మడం ద్వారా నర్సరీ నుండే అదనంగా మరో రూ. 5 లక్షల టర్నోవర్‌ను సాధిస్తున్నాడు. దళారులు, మండీలపై ఆధారపడకుండా వాట్సాప్- సోషల్ మీడియా ద్వారా నేరుగా కస్టమర్లకే విక్రయిస్తూ లాభాల మార్జిన్‌ను పెంచుకుంటున్నాడు.

భూపాల్ నాయక్ సాధించిన విజయం కేవలం ఒక వ్యక్తిగత సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.. నేటి యువతకు... ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులు లేదా ఉద్యోగులకు ఒక పెద్ద రోల్ మోడల్. వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడుకున్న నష్టాల వ్యాపారం కాదు... సరైన మార్కెట్ అవగాహన, ఆధునిక సేంద్రీయ పద్ధతులు పాటిస్తే ఐటీ ఉద్యోగాల కంటే మెరుగైన లైఫ్ స్టైల్ , ఆదాయాన్ని సొంత గడ్డపైనే సాధించవచ్చని ఆయన నిరూపించాడు. ఉన్నత చదువులు చదివిన వారు ఇలా `రివర్స్ మైగ్రేషన్` ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం దేశ భవిష్యత్తుకు ఎంతో శుభసూచకం. ముఖ్యంగా పంట పండించేందుకు భూమి ఉన్నా చాలామంది సాగు చేయ‌డానికి సిద్ధంగా లేరు. ఇలాంటి నిరాస‌క్త వ్యక్తులు వ్యూహాత్మ‌కంగా కొత్త‌గా ఎలా ఆలోచించాలో కూడా ఇత‌డు నేర్పిస్తున్నాడు. (నోట్‌: కృత్రిమ మేధ‌స్సు ప్ర‌కంప‌నాల‌ కాలంలో ఉద్యోగాల గ‌ల్లంత‌య్యే క్ర‌మంలో ఇలాంటి ఐడియాలు ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డాల‌ని ఆశిస్తూ..)