మోడీ రాహుల్ కి ఒకే ఒక్క మాటతో ఒవైసీ షాక్ !
తాజాగా యూపీ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ఈ దేశం యువ ప్రధానిని కోరుకుంటోంది అన్నారు.
By: Satya P | 27 July 2026 9:23 AM ISTమజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ దేశం ముందు అతి పెద్ద చర్చకు పాయింట్ ని పెట్టారు. అదేంటి అంటే ఈ దేశానికి యువ ప్రధాని కావాలని. దానికి ఆయన లాజిక్ తో సహా అన్నీ వివరించారు. దానిని వింటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే ఒవైసీ ఏ ఉద్దేశ్యంతో ఎవరిని టార్గెట్ చేసి అన్నారో తెలియదు కానీ ఆయన కామెంట్స్ తో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కూడా షాక్ ఇచ్చేశారు. ఇంతకీ ఒవైసీ ఏమన్నారు అంటే మ్యాటర్ వెరీ ఇంట్రెస్టింగ్ మరి.
యూత్ ప్రైమ్ మినిస్టర్ అంటూ :
తాజాగా యూపీ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ఈ దేశం యువ ప్రధానిని కోరుకుంటోంది అన్నారు. ఈ దేశంలో నూటికి అరవై శాతం మంది 35 లోపు యువత ఉన్నారని అందులో 50 శాతం పైగా 25 ఏళ్ళ యువత ఉన్నారని కూడా లెక్క చేప్పారు. మరి ఇంత పెద్ద యువ జనాభా ఉన్న దేశంలో యువ ప్రధాని కాకుండా వృద్ధులు అవడం సమంజసమా అని ఆయన లాజిక్ తోనే మాట్లాడారు. అంతే కాదు 2029 ఎన్నికల తరువాత 80 ఏళ్ళ వృద్ధుడు ప్రధాని కాకుండా యువ ప్రధాని కావాలన్నదే తమ ప్రయత్నం అన్నారు. యూత్ ప్రధాని అంటే 40 నుంచి 45 లోపు ఉండాలని కూడా ఒవైసీ ఒక కండిషన్ పెట్టారు. దాంతో మోడీకే కాదు రాహుల్ కి కూడా షాక్ తగిలినట్లు అయింది.
బీజేపీ ఘాటుగానే :
ముస్లిం బుజ్జగింపు రాజకీయాలలో భాగంగానే ఒవైసీ ఈ విధంగా మాట్లాడుతున్నారని బీజేపీ మండిపడింది. వయసుతో పదవులకు సంబంధం ఏంటి బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ ప్రశ్నించారు. అమెరికాను ఏలే అధ్యక్షుడు ట్రంప్ వయసు 80 ఏళ్ళు అన్నది మరచారా అని ఒవైసీని నిలదీశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతోంది అని ప్రతుల్ షా దేవ్ గుర్తు చేశారు. ఈ దేశంలో ప్రధానిని వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ఎన్నుకుంటారు అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సైతం :
ఇదే విషయం మీద కాంగ్రెస్ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. ఎందుకంటే 2029 నాటికి రాహుల్ గాంధీకి 59 ఏళ్ళ వయసు వస్తుంది. దాంతో ఆ పార్టీ కూడా ఒవైసీ కామెంట్స్ మీద బాగా హర్ట్ అయినట్లుంది. దాంతో కాంగ్రెస్ నేత రాకేష్ సిన్హా దీని మీద మాట్లాడుతూ భారత దేశం గొప్ప ప్రజాస్వామిక దేశం అన్నారు. ఈ దేశంలో వృద్ధులు ఎనభై ఏళ్ళ వారు అయినా పోటీ చేసి చేయవచ్చు అని అలాగే యువకులు కూడా పోటీ చేసి గెలవవచ్చు అన్నారు. అదే సమయంలో గెలిచిన పార్టీ తన నాయకుడుని ఎన్నుకుంటుందని అలా చూస్తే ప్రజలే తమ నాయకుడు ఎవరో కొత్త ప్రధాని ఎవరో ఎన్నుకుంటారు అని రాకేష్ సిన్హా వివరించారు. అదే విధంగా కాంగ్రెస్ కి చెందిన మరో ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ కూడా ఒవైసీ కామెంట్స్ మీద రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ గొప్ప విజన్ ఉన్న నాయకుడు అన్నారు. ఆయన ఈ రోజున దేశ నిర్మాణంలో అతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు.
యూత్ కే టికెట్లు :
అయితే ఒవైసీ మాత్రం ఇది యువ భారతం అని గట్టిగా నొక్కి చెబుతున్నారు. తమ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో యువతకే టికెట్లు ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే యువ ప్రధాని అంటూ ఒవైసీ మాటల మంటలను పుట్టించారు. నిజంగా ఈ దేశంలో యువ నేత పాలకుడు కావాలని జనాలు కోరుకుంటున్నారా అన్నదే బిగ్ డిబేట్. అలా కోరుకుంటే కచ్చితంగా యువకులే పగ్గాలు అందుకుంటారు. ఒకప్పుడు ప్రజలు రాజీవ్ గాంధీని ఎన్నుకున్నారు. ఆయన 40 ఏళ్ళకే దేశ ప్రధాని అయిపోయారు. మళ్ళీ ఆ తరువాత భారత దేశం యువ ప్రధానిని చూడలేదు. ఒవైసీ ఏ ఉద్దేశ్యంతో ఈ కామెంట్స్ చేసినా దేశ జనాభాలో అధికంగా యువత ఉన్నారు. మరి వారే ఈ దేశాన్ని నడిపించాలని అనుకుంటే వారు వృద్ధులు వద్దు అనుకుంటే యువ పాలన తప్పనిసరిగా వస్తుంది.
