బీజేపీ బలమేంటో చెప్పిన ఓవైసీ
ప్రతిపక్ష పార్టీలు అలసత్వం వహిస్తే, "రెప్పపాటులోనే బీజేపీ తన పని పూర్తి చేస్తుంది" అంటూ ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
By: A.N.Kumar | 12 Oct 2025 8:36 PM ISTభారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయంగా అత్యంత చురుకైన, అప్రమత్తమైన పార్టీ అని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు అలసత్వం వహిస్తే, "రెప్పపాటులోనే బీజేపీ తన పని పూర్తి చేస్తుంది" అంటూ ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
* బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది!
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఒవైసీ, బీజేపీ పనితీరును వివరిస్తూ ప్రతిపక్షాలకు ఒక రకంగా హెచ్చరిక పంపారు. బీజేపీ ఒక "24 గంటలూ పని చేసే పార్టీ" అని ఆయన అభివర్ణించారు. వారి వ్యూహాలు చాలా పక్కాగా ఉంటాయని, రాజకీయాల్లో వారు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు సూచన
"ప్రతిపక్షాలు అప్రమత్తంగా లేకపోతే, బీజేపీ తన లక్ష్యాలను సాధించడానికి పెద్దగా సమయం పట్టదు" అని, కేవలం రెప్పపాటులో వారు తమ పని పూర్తి చేస్తారని వ్యాఖ్యానించారు.
ఓటు చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా తనిఖీ
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలను ఆయన ఖండించారు. 2009, 2014 ఎన్నికల సమయంలోనే తన నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో డూప్లికేట్ పేర్లను గుర్తించి తాను సవాల్ చేశానని ఒవైసీ గుర్తు చేశారు. ప్రతి పార్టీ కూడా కేవలం ఆరోపణలు చేయడం కాకుండా, ఓటర్ల లిస్టును సీరియస్‌గా తనిఖీ చేయాలని ఒవైసీ సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అవగాహన, ప్రతి ఓటు విలువ చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ తన శక్తిని, విస్తరణను పెంచుకుంటున్న తరుణంలో, బీజేపీ బలంపై ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాల ఐక్యత, వ్యూహాలపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రతిపక్షాలు తమ కార్యాచరణను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరాన్ని ఆయన మాటలు బలంగా స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీ ప్రధాన బలాలు
బలమైన జాతీయవాద భావజాలం హిందుత్వం : భారతీయ సంస్కృతి, హిందూ మతం..ఇతర భారతీయ మతాల (జైన, సిక్కు, బౌద్ధ) రక్షకురాలిగా తనను తాను భావించడం. జాతీయవాదం, సాంస్కృతిక సంప్రదాయాలను బలంగా నమ్ముతుంది.
భావసారూప్యత: ఈ భావజాలం పార్టీకి కోర్ ఓటర్లను మరియు పటిష్టమైన మద్దతుదారుల సమూహాన్ని అందిస్తుంది.
పటిష్టమైన సంస్థాగత యంత్రాంగం : బీజేపీకి దేశవ్యాప్తంగా బలమైన పార్టీ యంత్రాంగం ఉంది. బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కమిటీలు, కార్యకర్తల నెట్‌వర్క్ చాలా పటిష్టంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీలలో ఒకటిగా 170 మిలియన్లకు పైగా సభ్యులు ఉన్నట్లు పేర్కొంది (2022 నాటికి).
కేంద్రంలో అధికారం - నాయకత్వం : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనాదరణ.. నిర్ణయాత్మక నాయకత్వం పార్టీకి ప్రధాన బలం. ఆయన నేతృత్వంలో కేంద్రంలో వరుసగా మూడుసార్లు (కూటమితో కలిపి) ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
చారిత్రక విజయాలు: 1984లో కేవలం 2 సీట్లతో మొదలై, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకోవడం ఈ పార్టీ బలాన్ని సూచిస్తుంది.
కీలక విధాన నిర్ణయాలు : ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి హామీలను నెరవేర్చడం ద్వారా తమ నిబద్ధతను నిరూపించుకుంది. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పుకోవడం, అలాగే అనేక సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు (ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్లు, తాగునీటి సదుపాయం) అమలు చేయడం.
కూటమి బలం : నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా లోక్‌సభలో సంఖ్యా బలాన్ని పెంచుకొని కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
మొత్తంగా బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ సహా ఏ ప్రతిపక్షం కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపించడం లేదు. అందుకే ఓవైసీ కూడా బీజేపీ ఏమరపాటుగా ఉంటే ఏసేస్తుందని స్పష్టం చేశాడు.
