Begin typing your search above and press return to search.

బీజేపీ, ఎంఐఎం.. భాయీ. భాయీ.. అస్సలు ఊహించలేదు కదా?

బిహారులోని అమౌర్ లో జరిగిన ఓ ర్యాలీలో ఒవైసీ ప్రసంగిస్తూ ఎన్డీఏకు షరతులతో మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Political Desk   |   25 Nov 2025 3:36 PM IST
బీజేపీ, ఎంఐఎం.. భాయీ. భాయీ.. అస్సలు ఊహించలేదు కదా?
X

పరస్పర భిన్న ధృవాలుగా ఇన్నాళ్లు రాజకీయాలు చేస్తున్న బీజేపీ, ఎంఐఎం ఒక్కటి కానున్నాయా? బీజేపీవి హిందుత్వ రాజకీయాలు అంటూ దుమ్మెత్తిపోసిన మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ మాటల్లో మార్పు ఎందుకొచ్చింది? బిహార్ రాజకీయాలు.. భవిష్యత్తులో పెను మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయా? అనే చర్చ జరుగుతోంది. బిహార్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒవైసీ.. ఇన్నాళ్లు బీజేపీపై ఒంటికాలిపై లేచేవారు. అలాంటిది ఆయన గొంతు సవరించుకుని బీజేపీకి దగ్గరయ్యేలా సంకేతాలివ్వడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.

బిహారులోని అమౌర్ లో జరిగిన ఓ ర్యాలీలో ఒవైసీ ప్రసంగిస్తూ ఎన్డీఏకు షరతులతో మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిజానికి ఎంఐఎం మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం లేకపోయినా, మజ్లిస్ నేత ఇలా ఓపెన్ గా తన మద్దతు ఉంటుందని ప్రకటించడం కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపుతుందా? అంటున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు అంటే ఒవైసీ పరోక్షంగా బీజేపీతో చెలిమి కోరుకుంటున్నట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, మజ్లిస్ చేతులు కలిపితే తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో సరికొత్త రాజకీయం అవిష్కృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.

బిహారులో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతమైన సీమాంచల్ అభివృద్ధి చేయాలని ఒవైసీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లు ఉంటే ఎన్డీఏ 14 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించి తన పట్టునిలుపుకుంది. ఎప్పుడు వరదలు, వలసలు, అవినీతి వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సీమాంచల్ వాసులను అభివృద్ధి దరికి చేర్చాలని ఒవైసీ కోరుతున్నారు. ఈ కారణంతోనే ఆయన ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే ముస్లిం మైనార్టీ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఐఎం అధినేత ఇలా ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇప్పటికిప్పుడు ఈ ప్రతిపాదనను బీజేపీ పట్టించుకోకపోయినా, అవసరమైన సమయంలో తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా హిందుత్వ ముద్ర వేస్తూ మైనార్టీలను దూరం చేస్తున్న ఎంఐఎం పార్టీనే స్వయంగా మితృత్వానికి దారులు వేస్తుండటం.. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇన్నాళ్లు ఎంఐఎం యాంటీ బీజేపీ రాజకీయాలనే చేసింది. ఇప్పుడు షరతులతో స్నేహం అంటోంది. బీజేపీ నుంచి కూడా సానుకూల స్పందన వస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు తెలంగాణలోని స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. నిజానికి ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన పెరుగుతుందని విశ్లేషించారు. కానీ, ఒవైసీ బిహార్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో రాజకీయం పూర్తిగా తలకిందులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు.