Begin typing your search above and press return to search.

ఇదెక్కడి విడ్డూరం.. ఏకంగా రాత్రికి రాత్రే బ్రిడ్జినే లేపేసారుగా!

రాత్రి వరకు అక్కడ ఒక భారీ వంతెన ఉంది.. జనం నడిచారు, వాహనాలు వెళ్లాయి. కానీ సూర్యుడు ఉదయించేసరికి అక్కడ కేవలం ఖాళీ కెనాల్ మాత్రమే మిగిలింది.

By:  Madhu Reddy   |   25 Jan 2026 9:26 AM IST
ఇదెక్కడి విడ్డూరం.. ఏకంగా రాత్రికి రాత్రే బ్రిడ్జినే లేపేసారుగా!
X

రాత్రి వరకు అక్కడ ఒక భారీ వంతెన ఉంది.. జనం నడిచారు, వాహనాలు వెళ్లాయి. కానీ సూర్యుడు ఉదయించేసరికి అక్కడ కేవలం ఖాళీ కెనాల్ మాత్రమే మిగిలింది. 70 అడుగుల పొడవు, 10 టన్నుల బరువున్న స్టీల్ బ్రిడ్జిని దొంగలు అమాంతం మాయం చేసేశారంటే నమ్మశక్యంగా లేదు కదూ? ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులే కాదు, చివరకు పోలీసులు కూడా ఈ సాహసోపేతమైన దొంగతనాన్ని చూసి అవాక్కవుతున్నారు.

ప్రణాళికాబద్ధంగా పది టన్నుల ఇనుము మాయం..

హస్‌దేవ్ లెఫ్ట్ కెనాల్‌పై సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి స్థానికులకు ఎంతో కాలంగా ఆధారంగా ఉండేది. అయితే, పాత ఇనుముపై కన్నేసిన దొంగల ముఠా, ఎవరూ ఊహించని రీతిలో పక్కా ప్లాన్ వేసింది. సుమారు 15 మంది సభ్యులు, గ్యాస్ కట్టర్లు, భారీ వాహనాలతో వచ్చి అర్ధరాత్రి వేళ ఆపరేషన్ మొదలుపెట్టారు. 10 టన్నులకు పైగా బరువున్న ఆ భారీ నిర్మాణాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, లారీల్లో ఎక్కించుకుని పారిపోయారు. తెల్లవారుజామున నిద్రలేచిన స్థానికులు బ్రిడ్జి ఉండాల్సిన చోట ఖాళీని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.

వ్యవస్థల కళ్లుగప్పి.. తుక్కుగా మారిన నిర్మాణం:

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇది ఒకరిద్దరు చేసిన పని కాదని, వంతెనను కట్ చేసి దానిని తుక్కు కింద అమ్మేయడానికి పెద్ద ముఠానే రంగంలోకి దిగిందని గుర్తించారు. ప్రభుత్వ ఆస్తిని, అదీ అంత భారీ నిర్మాణాన్ని సాదాసీదాగా తీసుకెళ్తుంటే అధికారులు గానీ, స్థానికులు గానీ గుర్తించలేకపోవడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది అని.. కేవలం కొంత డబ్బు కోసం ప్రజా సౌకర్యాన్ని నాశనం చేస్తూ, వ్యవస్థల కళ్లుగప్పి ఇంతటి సాహసానికి ఒడిగట్టడం ఆందోళన కలిగించే విషయం అంటూ ప్రజలు సైతం మండి పడుతున్నారు. నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు ఇప్పుడు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు.

ఇనుము కోసం వంతెననే ఎత్తుకెళ్లే స్థాయికి దొంగలు వెళ్లారంటే, మన చుట్టూ ఉన్న ప్రభుత్వ ఆస్తుల రక్షణ ఎంత ప్రశ్నార్థకంగా మారిందో అర్థమవుతోంది అంటూ నెటిజన్స్ కూడా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు కేవలం పోలీసుల వైఫల్యం మాత్రమే కాదు, మన సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేస్తున్నాయి అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి వింతైన, విడ్డూరమైన చోరీలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే నిఘా పెంచడమే కాకుండా, దోషులకు కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.