ఆడవేషంలో తప్పించుకున్న లాడెన్.. CIA మాజీ ఆఫీసర్ జాన్ కిరాయకో..
అమెరికాపై 2001, సెప్టెంబర్ 11 దాడి తర్వాత ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన పేరు ‘ఒసామా బిన్ లాడెన్’.
By: Tupaki Political Desk | 25 Oct 2025 3:25 PM ISTచరిత్రలోని ప్రతి యుద్ధానికి, ప్రతి ఉగ్రవాద దాడికి, ప్రతి రహస్య ఆపరేషన్ వెనుక ఒక తెలియని కథ ఉంటుంది. కానీ వాటిలో కొన్నింటి గురించి దశాబ్దాల తర్వాత మాత్రమే నిజాలు బయటకు వస్తాయి. అమెరికాపై 2001, సెప్టెంబర్ 11 దాడి తర్వాత ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన పేరు ‘ఒసామా బిన్ లాడెన్’. అతని వెతుకులాటలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) దాదాపు ప్రపంచం మొత్తాన్ని గాలించింది. కానీ ఇప్పుడు, మాజీ CIA అధికారి జాన్ కిరాయకో వెలుగులోకి తెచ్చిన ఒక కథ, ఆ వెతుకులాట వెనుక ఉన్న వాస్తవాలను మరలా చర్చనీయాంశంగా మార్చింది.
కిరాయకో వెల్లడించిన వివరాల ప్రకారం.. 9/11 దాడుల తర్వాత అమెరికన్ ఫోర్స్ ఆఫ్గానిస్తాన్‌లోని టోరా బోరా పర్వత ప్రాంతంలో ఆల్‌ఖైదా స్థావరాన్ని చుట్టుముట్టాయి. ‘అది అంతిమ దశ. లాడెన్ ఇక బయటపడడంలేదు అనుకున్నాం’ అని కిరాయకో గుర్తుచేసుకున్నారు. కానీ ఆపరేషన్ అంతం అయ్యాక CIAకి అర్థమైంది లాడెన్ ముందే తప్పించుకున్నాడు అని ఎలా? అదే అత్యంత ఆసక్తికరమైన విషయం.
అమెరికన్ సైన్యంలో ఆ సమయంలో పనిచేస్తున్న ఒక అనువాదకుడు (లాంగ్వేజ్ ట్రాన్స్ లేటర్) పశ్తో అరబిక్ భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి అసలే ఆల్‌ఖైదా సభ్యుడని CIAకి తర్వాత తెలిసింది. ఆ వ్యక్తి సైనికులకు, కమాండర్లకు ‘ఉగ్రవాదులు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు, కానీ మీరు మొదట మహిళలు, పిల్లలను పంపించాలి’ అని చెప్పాడు. అతని మాటలు నిజమని నమ్మి అమెరికన్ ఆర్మీ అంగీకరించింది. కానీ అదే క్షణం లాడెన్ తన వేషాన్ని మార్చుకున్నాడు. ఆడదుస్తులు వేసుకున్నాడు. ముఖానికి నికాబ్ కప్పుకున్నాడు. పిల్లలు, మహిళల మధ్యే బయటికి వచ్చి, హెలికాప్టర్లను, డ్రోన్లను మభ్యపెట్టి, సురక్షితంగా సరిహద్దు దాటి పారిపోయాడు.
కిరాయకో చెప్పిన వివరాల ప్రకారం.. ‘ఆ సమయంలో మేం అర్థం చేసుకోలేకపోయాం. కానీ తర్వాత రికార్డులు, స్థానిక వాంగ్మూలాలు చూసినప్పుడు, లాడెన్ ఆ రోజు మహిళా వేషంలో టోరా బోరా నుంచి బయటపడ్డాడని నిర్ధారించుకున్నాం. అదే అమెరికా చరిత్రలో CIAకి జరిగిన అతిపెద్ద మభ్యపాటు.’ అని చెప్పుకచ్చాడు.
ఆ ఘటన తర్వాత CIAలో పెద్ద మార్పులు జరిగాయి. స్థానిక భాషల్లో అనువాదకుల నియామక ప్రక్రియను పూర్తిగా మార్చి, ప్రతి నియామకుడి నేపథ్యాన్ని ఖచ్చితంగా పరిశీలించే కొత్త విధానాన్ని రూపొందించారు. ‘లాడెన్ మాకు నేర్పించిన పాఠం మేం ఎంత శక్తివంతమైనా, ఒక తప్పు విశ్వాసం ఎంత ప్రమాదకరమో గుర్తు చేసింది.’ అని కిరాయకో చెబుతున్నారు.
తర్వాత దాదాపు దశాబ్దం పాటు లాడెన్ వెతుకులాట కొనసాగించింది. 2011లో పాకిస్థాన్‌లోని అబ్బొటాబాద్ పట్టణంలో జరిగిన స్పెషల్ ఆపరేషన్‌లో అతను హతమయ్యాడు. కానీ టోరా బోరాలో అతను CIA కళ్ల ముందే తప్పించుకున్న కథ ఇప్పటికీ రహస్య ఆపరేషన్‌లలో అత్యంత మర్మమైన ఘట్టంగా మిగిలిపోయింది.
ఇంటెలిజెన్స్ కు ఎంత శక్తి ఉన్నా.. ఒక మనిషి చతురత, ఒక మాయ వేషం క్షణాల్లో దాన్ని నిర్వీర్యం చేయగలదని లాడెన్ తప్పించుకున్న ఉదంతం నేర్పిన పాఠం. లాడెన్ ఆ రోజు కేవలం CIAని మోసం చేయలేదు.. అతను ఒక దేశం నమ్మకాన్ని, గర్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఒక క్షణం తారుమారు చేశాడు. చరిత్రలో యుద్ధాలు తుపాకీతో కాదు, కొన్నిసార్లు ముసుగుతో గెలుస్తారు లాడెన్ టోరా బోరాలో చేసినదే అది.
