ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం: మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు
భాగ్యనగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్ మరోసారి నెత్తురోడింది. తాజాగా చోటుచేసుకున్న భీకర రోడ్డు ప్రమాదం రాజకీయ వర్గాల్లోనూ నగర ప్రజల్లోనూ తీవ్ర కలకలం రేపింది.
By: A.N.Kumar | 23 March 2026 11:03 PM ISTభాగ్యనగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్ మరోసారి నెత్తురోడింది. తాజాగా చోటుచేసుకున్న భీకర రోడ్డు ప్రమాదం రాజకీయ వర్గాల్లోనూ నగర ప్రజల్లోనూ తీవ్ర కలకలం రేపింది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ) సమీపంలో రాత్రి సుమారు 8:52 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన తీరు.. సాంకేతిక లోపమే శాపమైందా?
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఒక ఫార్చూనర్ కారు వేగంగా వెళ్తోంది. అదే సమయంలో ముందు వెళ్తున్న ఒక డీసీఎం వాహనం టైరు అకస్మాత్తుగా ఊడిపోవడంతో ఆ వాహనం రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయింది. వెనుక నుంచి వస్తున్న ఫార్చూనర్ కారు డ్రైవర్ ఊహించని ఈ పరిణామంతో వాహనాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో ఫార్చూనర్ కారు అత్యంత వేగంగా వెళ్లి డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఫార్చూనర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె అక్షర (23) కు తీవ్ర గాయాలయ్యాయి. చిన్న కుమార్తె దిశీర (19) స్వల్ప గాయాలతో బయటపడగా వీరితో పాటు కారులో ఉన్న అభిరామ్ రెడ్డి , డ్రైవర్ అరికపూడి దుర్గా సాయి కూడా గాయపడ్డారు.
ఆసుపత్రిలో అత్యవసర చికిత్స.. పరామర్శించిన కేటీఆర్
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు గాయపడిన వారిని తక్షణమే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్షర పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారు ప్రమాదం నుండి కోలుకుంటున్నారని, వారి పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అక్షర ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ర్యాష్ డ్రైవింగ్? లేక దురదృష్టమా?
నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. డీసీఎం వాహనం టైరు ఊడిపోవడం అనేది ప్రధాన సాంకేతిక లోపంగా కనిపిస్తున్నప్పటికీ ఫార్చూనర్ కారు వెళ్తున్న వేగం కూడా ప్రమాద తీవ్రతను పెంచిందని ప్రాథమికంగా నిర్ధారించారు. "ఔటర్ రింగ్ రోడ్‌పై వాహనాల ఫిట్‌నెస్‌తో పాటు వేగ నియంత్రణ చాలా ముఖ్యం. చిన్నపాటి నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపం ప్రాణాంతకంగా మారుతున్నాయి " అని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భద్రతపై ఆందోళన
ఈ ప్రమాదంతో ఓఆర్ఆర్ పై భద్రతా ఏర్పాట్లపై మళ్లీ చర్చ మొదలైంది. రాత్రి వేళల్లో వాహనాల వేగాన్ని కట్టడి చేయడం, మొబైల్ తనిఖీలను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషాద ఘటన మాగంటి గోపీనాథ్ అనుచరులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
