టెక్ రంగంలో మరో షాక్… వేలాది ఉద్యోగుల తొలగింపు!
బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదికల ప్రకారం, ఒరాకిల్ సంస్థ రాబోయే కొద్ది వారాల్లోనే భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
By: Madhu Reddy | 6 March 2026 3:49 PM ISTగత కొన్నాళ్లుగా ఐటీ రంగంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. దిగ్గజ సంస్థలైన అమెజాన్, యూపీఎస్ బాటలోనే ఇప్పుడు మరో టెక్ జెయింట్ 'ఒరాకిల్' కూడా భారీ స్థాయిలో ఉద్యోగుల కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డేటా సెంటర్ల నిర్వహణ ఖర్చు పెరగడం, AI విప్లవం వంటి కారణాలతో వేలాది మందిని ఇంటికి పంపేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వార్త ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. షాక్‌లో ఐటీ జనం:
బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదికల ప్రకారం, ఒరాకిల్ సంస్థ రాబోయే కొద్ది వారాల్లోనే భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది. ఈ తొలగింపులు వేల సంఖ్యలో ఉండవచ్చని సమాచారం. ఇక ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు 30 వేల మంది వరకు తొలగించగా, ఒరాకిల్ కూడా అదే స్థాయిలో అంటే దాదాపు 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల నుండే ప్రారంభం కావచ్చని వార్తలు వస్తుండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ ఉద్యోగులు ఊపిరి బిగబట్టి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
ఏఐ విప్లవం.. పెరిగిన ఖర్చులే కారణమా:
ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటోంది అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, డేటా సెంటర్ల నిర్వహణ వ్యయం భారీగా పెరగడం. రెండోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం. ఏఐ రాకతో పాత పద్ధతుల్లో చేసే పనులు తగ్గిపోవడం, ఆటోమేషన్ పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గుతోందని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖర్చులను తగ్గించుకుని లాభాల బాట పట్టేందుకు ఈ 'సైజింగ్ డౌన్' ఆపరేషన్ చేపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
టెక్ రంగం భవిష్యత్తుపై నీలినీడలు:
ఒకవైపు కొత్త టెక్నాలజీలు వస్తున్నాయని సంతోషపడాలో, లేక ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని బాధపడాలో తెలియని స్థితిలో ఐటీ రంగం ఉంది. ఒరాకిల్ నిర్ణయం కేవలం ఆ కంపెనీకే పరిమితం కాకుండా, మొత్తం టెక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలే ఇలా ఉద్యోగాలను కోత విధిస్తుంటే, స్టార్టప్‌ల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఇక అయితే, కంపెనీ నుండి ఇంకా అధికారికంగా కచ్చితమైన సంఖ్య వెలువడలేదు. కానీ, పరిస్థితులు చూస్తుంటే ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది స్పష్టమవుతోంది. టెక్ ప్రపంచంలో మార్పులు సహజమే అయినా, ఇలాంటి భారీ లేఆఫ్స్ వార్తలు ఎప్పుడూ బాధగానే ఉంటాయి. ఇక ఒరాకిల్ నుండి వచ్చే అధికారిక అప్‌డేట్ కోసం వేచి చూడాల్సిందే.
