Begin typing your search above and press return to search.

సునామీ వేళ రోడ్డు గేటు ఓపెన్ చేసిన టాప్ యాంకర్... ట్రెండింగ్ ఇష్యూ!

ఈ సమయంలో తీర ప్రాంతాంలోనూ.. ప్రధానంగా అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయిలోనూ ఉన్న పర్యాటకులు, స్థానికులు సురక్షిత ప్రంతాలకు (ఎత్తైన ప్రాంతాలకు) తరలి వెళ్తున్నారు. ఈ సమయంలో ఓప్రా విన్ ఫ్రే అందుకు దారి ఇవ్వలేదు!

By:  Raja Ch   |   30 July 2025 3:30 PM IST
సునామీ వేళ రోడ్డు గేటు ఓపెన్ చేసిన టాప్ యాంకర్... ట్రెండింగ్ ఇష్యూ!
X

బుధవారం ఉదయం రష్యాను భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో రష్యాతో పాటు జపాన్, అమెరికా, మొదలైన పలు దేశాల్లో సునామీ మొదలైంది! సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రముఖ టీవీ హోస్ట్ 70 ఏళ్ల ఓప్రా విన్‌ ఫ్రే వ్యవహారం ట్రెండింగ్ గా మారింది.

అవును... రష్యాలోని సముద్ర గర్భంలో సంభవించిన కారణంగా జపాన్ తో పాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ సమయంలో తీర ప్రాంతాంలోనూ.. ప్రధానంగా అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయిలోనూ ఉన్న పర్యాటకులు, స్థానికులు సురక్షిత ప్రంతాలకు (ఎత్తైన ప్రాంతాలకు) తరలి వెళ్తున్నారు. ఈ సమయంలో ఓప్రా విన్ ఫ్రే అందుకు దారి ఇవ్వలేదు!

వివరాళ్లోకి వెళ్తే... హవాయ్ ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ కావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. ప్రధానంగా... మావ్ ప్రాంతానికి ఈ ముప్పు ఎక్కువగా ఉండటంతో ఎత్తయిన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో.. వైలీ నుంచి కులా ప్రాంతానికి వెళ్లాలంటే చుట్టు అవుతుంది.. ఫలితంగా చాలా సమయం వృథా అవుతుంది.

అయితే దీనికి ఓ షార్ట్ కట్ మార్గం ఉంది. కాకపోతే.. అది ఓప్రా విన్‌ ఫ్రేకు సంబంధించిన ఆస్తుల గుండా వెళ్లే ప్రైవేటు రోడ్డు. ఈ క్రమంలో... విన్ ఫ్రే కనుక ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తే చాలా తక్కువ సమయంలోనే ఈ మార్గం గుండా వెళ్లి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోగలరు. అయితే విన్‌ ఫ్రే మాత్రం ఆ గేట్‌ ను ఓపెన్ చేసేందుకు ససేమిరా అంటున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా.. మేము ఇరుక్కుపోయాము, సునామీ రాబోతోంది, ఓప్రా కాస్త ఈ రోడ్డు ఓపెన్ చేయించండి, పోలీసులు ప్రయత్నిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలు పెడుతూ నెటిజన్లు, ఆమె అభిమానులు రిక్వస్టులు పెట్టారు. ఈ వీడియోలు విపరీతంగా హల్ చల్ చేశాయి. ఈ సమయంలో ఆ రోడ్డు ముందు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఆఖరికి కరుణించిన ఓప్రా!:

ఈ సమయంలో తీవ్ర ఆందోళనలు నెలకొన్న వేళ ఓప్రా మనసు కరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలో.. చాలాసేపటి తర్వాత, తీవ్రమైన ప్రజా ఒత్తిడి తర్వాత, సునామీ నుండి తప్పించుకోవాలని వెళ్తున్న వారికి ఓప్రా ప్రైవేట్ రోడ్డు తెరవబడింది. వాస్తవానికి ఈ పని కొన్ని గంటల క్రితమే చేసి ఉండాలి అని అంటూ... ఈ రోడ్డు తెరవబడిందని మిగిలిన వారికి సూచిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తున్నారు.

1000 ఎకరాల ఆస్తులు!:

హవాయ్ ద్వీపంలో ఓప్రా ఆస్తులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... మావ్ ద్వీపంలో ఆమె సుమారు 1000 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని ప్రముఖ బిజినెస్ పోర్టల్ రియల్టర్ డాట్ కామ్ పేర్కొంది. 2002 - 03 ప్రాంతంలో 163 ఎకరాలను కులా ప్రాంతంలో కొనుగోలు చేసి, అక్కడే అత్యాధునిక వసతులతో కూడిన ఫామ్‌ హౌజ్ నిర్మించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ ప్రైవేటు రోడ్డును నిర్మించుకున్నారు.