మోడీ స్మరణలో నేలా-నింగీ.. రీజనేంటి?!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని(సెప్టెంబరు 17) ఆసేతు హిమాచలం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.
By: Garuda Media | 17 Sept 2025 8:00 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని(సెప్టెంబరు 17) ఆసేతు హిమాచలం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. నేటితో ఆయనకు 75 ఏళ్లు నిండనున్నాయి. 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. అయితే.. ప్రస్తుతం జీఎస్టీ తగ్గింపు.. అదేవిధంగా అమెరికాపై సుంకాల యుద్ధం చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో మోడీ ప్రభ వెలిగిపోతోంది. దీంతో మోడీకి తిరుగులేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనిని గమనించిన.. స్వపక్షమే కాదు.. విపక్షంలోని నాయకులు కూడా మోడీకి అభినందనలతో చెలరేగిపోయారు.
సాధారణంగా విపక్షంలో ఉన్న మెజారిటీ నాయకులు మోడీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. ఆయన కు ఇప్పటి వరకు చాలా మంది నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు. కానీ, తొలిసారి.. పార్టీలకు అతీతం గా కూడా మోడీకి శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం.. నానాటికీ పెరుగుతున్న మోడీ గ్రాఫేనని తెలుస్తోంది. వాస్తవానికి మూడో పర్యాయం అధికారంలోకి రావడమే ఎక్కువనుకునే మన దేశంలో వచ్చిన తర్వాత.. విజయాలు దక్కించుకుంటున్న వైనం కూడా మోడీకి కలిసి వస్తోంది.
ఇక, తాజాగా సామాన్యుల మనసు దోచుకునేలా తాము నష్టపోయినా ఫర్వాలేదని భావించి జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చారు. అంతేకాదు.. వీటికి ప్రాచుర్యం కూడా కల్పిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా `మోడీ తప్ప.. ఇంకెవరు చేయగలరు..`అనే వాదనను బలపడేలా చేస్తోంది. ఇదేసమయంలో అమెరికా విధిస్తున్న సుంకాలకు ఎదురొడ్డు తున్నామని కూడా కేంద్రం ప్రచారం చేస్తోంది. ఇది నిజమే. కానీ, ప్రచారంలో మరింత ఎక్కువగానే ఉంది. ఇది కూడా వ్యాపారులకు మరింత కలిసి వచ్చింది.
మరోవైపు.. `స్థానికం` పేరుతో మోడీ చేస్తున్న వ్యాఖ్యలు.. భాషలకు అతీతంగా.. రాష్ట్రాలకు అతీతంగా కూడా ఆయనను ప్రజలకు చేరువ చేసిన మాట.. చేస్తున్న మాట కూడా వాస్తవం. స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్లు కల్పిస్తున్నారు. ఇవన్నీ.. అనేక రాష్ట్రాల ప్రజలు ఉత్సాహం కలిగిస్తున్నాయి. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగకపోవడం కూడా.. ఆశ్చర్యకరం. దీంతో మోడీ మినహా..(ఇప్పుడున్న పరిస్థితిలో) మరో నాయకుడు లేడన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ పేరు.. ఆయన నామస్మరణ నేలా.. నింగీ.. అన్నట్టుగా వినిపిస్తుండడం గమనార్హం.
