శబరిమల ను విజయన్ సర్కారు దారుణంగా మార్చిందా?
క్యాలెండర్ ఇయర్ లో దసరా నుంచి మొదలయ్యే అయ్యప్పస్వాముల ప్రవాహం.. అంతకంతకూ పెరుగుతూ సంక్రాంతి అనంతరం వరకు హాడావుడి సాగుతూనే ఉంటుంది.
By: Garuda Media | 20 Nov 2025 11:35 AM ISTక్యాలెండర్ ఇయర్ లో దసరా నుంచి మొదలయ్యే అయ్యప్పస్వాముల ప్రవాహం.. అంతకంతకూ పెరుగుతూ సంక్రాంతి అనంతరం వరకు హాడావుడి సాగుతూనే ఉంటుంది. ఏడాదికి ఏడాది పెరగటమే తప్పించి.. తగ్గటమన్నది ఉండని భక్తుల రద్దీ నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా తరలి వచ్చే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం.. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్నది మర్చిపోకూడదు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఏ మాత్రం బాగోలేదన్న విమర్శలు అంతకంతకూ పెరగటమే కాదు.. విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. శబరిమలను సందర్శించేందుకు వచ్చే భక్తులకు దారుణ అనుభవాన్ని మిగిల్చేలా పినరయి విజయన్ సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.
గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఊమెన్ చాందీ అయితే.. తానే స్వయంగా పంపా నదికి వెళ్లి మరీ పరిస్థితిని సమీక్షించేవారని.. స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించేవారన్న విషయాన్ని పలువురు గుర్తు తెచ్చుకుంటున్నారు. అందుకు భిన్నంగా విజయ్ సర్కారు వ్యవహరిస్తోందన్నది విపక్షాల వాదన. అంతేకాదు.. ప్రస్తుతం శబరిమలతో పాటు..శబరిమలకు వెళ్లే మార్గం అత్యంత దారుణంగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
శబరిమలలో ప్రస్తుత పరిస్థితి భయంకరంగా ఉందని దేవస్థానం బోర్డు అధ్యక్షుడే స్వయంగా అన్న మాటల్ని ప్రస్తావిస్తున్నారు. అయ్యప్ప పేరుతో లాభాల వేట ప్రారంభించిన విజయ్ సర్కరు తీరును ఎండగడుతున్నారు. భక్తులకు తాగు నీరు లేదని.. మరుగుదొడ్ల సౌకర్యం లేదని.. క్యూలైన్లలో పది-పదిహేను గంటలు నిలబడి.. ఇబ్బందులకు గురవుతున్న తీరును ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. స్వాములు నడిచే దారిలో మురుగునీరు ప్రవహిస్తోందని.. పంపానది మురికి కూపంగా మారిందని మండిపడుతున్నారు. నీలక్కల్ పార్కింగ్ ప్రదేశం మురికి కూపంగా తయారైందని.. పంపాలో నీళ్లు నల్ల రంగులోకి మారిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
సీజన్ ప్రారంభానికి ముందే సన్నాహాలు చేయాల్సిన సర్కారు అదేమీ చేయలేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాల విషయాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని.. ఉద్దేశపూర్వకంగానే శబరిమల సీజన్ ను గంరదగోళానికి గురి చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. శబరిమల డెవలప్ మెంట్ కోసం నిధుల్ని ప్రకటించినా.. విడుదల చేయని తీరును తప్పు పడుతున్నారు. స్వాములు నడిచే దారిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తుల సౌకర్యాల అంశంపై కేంద్రం కల్పించుకోవాలని కేరళ బీజేపీ నేతలు కోరుతున్నారు. శబరిమల చరిత్రలోనే పరిస్థితులు దారుణంగా మారాయని.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న మాటను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు.. బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
