ప్రతిపక్షమంతా ఒక్కటిగా...మోడీ షా టార్గెట్ గా !
ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ ఒక కొత్త రాజకీయ సందర్భాన్ని సన్నివేశాన్ని దేశానికి చూపించింది.
By: Satya P | 2 Nov 2026 9:20 AM ISTఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ ఒక కొత్త రాజకీయ సందర్భాన్ని సన్నివేశాన్ని దేశానికి చూపించింది. ప్రత్యేకించి బీజేపీ పాలకులకు కూడా కళ్ళకు కట్టించింది. ఇంతకీ ఆ సీన్ ఏంటి అంటే దేశంలోని ఆసేతు హిమాచలం దాకా వివిధ రాజకీయ పార్టీల నాయకులు అంతా కలసి ఒక్క చోటకు చేరడం. వారిని చేర్చింది ఎవరూ అంటే ఓటు చోరీ నినాదమో లేక జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ మాత్రమే కాదు, అంతకు మించి మోడీ వ్యతిరేక రాజకీయం. దేశంలో ఎన్డీయే ఆక్రమించిన రాజకీయ మైదానం సగం ఉందో లేదో కానీ ఆ మిగిలినది అంతా తాము ఆక్రమించుకుంటామని ఒక్కటిగా నిలిచి మోడీని ఢీ కొంటామని ఒక పదునైన సందేశమే రామ్ లీలా మైదానం ఇచ్చింది.
అన్నీ కలగలసి :
కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ప్రియాంకా గాంధీ, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, కాశ్మీర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఇలా ఒక్కరేమిటి ఇండియా కూటమిలో ఉన్న వారు అంతా హాజరయ్యారు. అంతా కలసి ఒకే వేదిక పంచుకున్నారు. ఒకే నినాదం వినిపించారు. ఢిల్లీ వీధులలో చేసిన ర్యాలీతో దేశానికి తాము అంతా ఉన్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అందరి మాటా ఒక్కటే. ఓట్ల చోరీ జరిగింది అని. అందరి డిమాండ్ ఒక్కటే జ్ఞానేశ్ కుమార్ దిగిపోవాలని. ఇక రాహుల్ గాంధీ అయితే ఒక అడుగు ముందుకేసి అందరి మాట తన మాటగా చెప్పేశారు, ఈ రోజు జ్ఞానేశ్, రేపటి రోజున మోడీయే మా టార్గెట్ అంటూ.
భారీ జన సందోహం :
ఇక ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి మార్చ్ కానీ సభ కానీ ఇంతటి జన సందోహంతో నిండిపోతుందని వారు కూడా ఊహించి ఉండరేమో. ఆ విధంగా భారీగా జనసందోహం తరలివచ్చింది. విపక్షాల నేతలు సైతం ఈ స్థాయి స్పందనను ముందే అంచనా వేసి ఉండరనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అందుకే ఈ జనాన్ని చూసి ఉక్కిరిబిక్కిరి అయి మరింత ఆవేశపూరితంగా ఉత్తేజ పూరితంగా ఇండీ కూటమి నాయకులు అంతా ఘాటైన ప్రసంగాలు చేశారు. ఇక చూస్తే రామ్ లీలా మైదానం నలుమూలలా జనంతో కిక్కిరిసి పోవడమే కాకుండా, పరిసర వీధులు కూడా కూటమి మద్దతుదారులతో నిండిపోయాయి.
ఇండియా కూటమి హుషార్ :
ఇన్నాళ్ళూ ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారని ప్రచారాలు సాగేవి. అంతే కాదు పదవుల గురించి కూడా విభేదాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగింది. ఇపుడు అందరిదీ ఒక్కటే లక్ష్యంగా మారింది. మోడీ ప్రభుత్వాన్ని ముందు గద్దె దించాలన్నదే ఆ లక్ష్యం. ఆ తరువాతనే మిగిలినవి అన్నీ అంటూ అంతా కూడబలుక్కుని మరీ వేదిక పంచుకున్నారనిపిస్తోంది అంటున్నారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ఇండియా కూటమి తన ఉనికిని ప్రజా బలాన్ని బలంగా చాటుకోగలిగింది. అంతే కాదు దేశానికి అదే సమయంలో ఎన్డీయే పెద్దలకూ చూపించగలిగింది. మోడీని రాజకీయంగా సవాల్ చేస్తూ సాగిన ఈ సభ ఇండియా కూటమిని ఒక్కసారిగా పదగుడులు ముందుకు తీసుకుని వెళ్ళింది అని అంటున్నారు. మరి ఈ ఉత్సాహం ఇక్కడితో ఆగేది కాదని మరిన్ని సభలతో ఇక్యంగా ఇండీ కూటమి దూకుడు చేస్తే ఎన్డీయే కౌంటర్ ఏమిటి ఎలా ఉంటుంది అన్నదే చూడాల్సి ఉంది.
