Begin typing your search above and press return to search.

ఏపీలో కూడా సర్....వైసీపీకి ఓకేనా ?

సర్ అంటే ఓకే సర్ అని దేశంలో విపక్షం అసలు అనడం లేదు, ఎందుకంటే అక్కడ తమ ఓటమి ఉందని అంటోంది.

By:  Satya P   |   6 Nov 2025 8:04 PM IST
ఏపీలో కూడా సర్....వైసీపీకి ఓకేనా ?
X

సర్ అంటే ఓకే సర్ అని దేశంలో విపక్షం అసలు అనడం లేదు, ఎందుకంటే అక్కడ తమ ఓటమి ఉందని అంటోంది. రీసెంట్ గా రాహుల్ గాంధీ అయితే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓటర్ల గల్లంతు చోరీ అని పెద్ద ఆరోపణలే చేశారు. ఓట్లను అర్హులకు కాకుండా తొలగిస్తున్నారు అని తమకు అనుకూలమైన వారి జాబితానే రూపొందిస్తున్నారని పైగా ఒకే ఇంటి నంబర్ తో ఒకే ఓటర్ పేరు మీద ఎన్నో ఓట్లు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఆయన ఈసీని బీజేపీని కలిపి విమర్శలు చేశారు. ఇక తమిళనాడులో స్టాలిన్ కానీ పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కానీ సర్ అంటే నో అంటున్నారు. మమత అయితే ఇది సైలెంట్ రిగ్గింగ్ కోసమే అని పెద్ద అభాండమే వేశారు. ఇండియా కూటమి వామపక్షాలు దేశంలో ఎన్డీయేతర పార్టీలు అన్నీ సర్ ని వ్యతిరేకిస్తున్న నేపేధ్యంలో ప్రస్తుతం రెండవ దశగా దేశంలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ నవంబర్ 4 నుంచి మొదలైపోయింది. అయితే విపక్షాల నిరసనలు ఆగ్రహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

సర్ అంటే ఏమిటి :

ఇంతకీ సర్ అంటే ఏమిటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్న మాట. దేశంలో చూస్తే బీహార్ తో కలుపుకుని 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల విషయం ఎపుడు అన్న చర్చ ఉండనే ఉంది. అయితే తాజాగా చూస్తే కనుక ఏపీలో కూడా తొందరలో సర్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. బహుశా మూడవ విడతలో ఇది జరగవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్-2025 కు పూర్తి స్థాయి లో సంసిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు వివేక్ యాదవ్ రాష్ట్ర సెక్రటేరియట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

ఇప్పటి నుంచే ఫోకస్ :

ఏపీలో ఓటు హక్కుకు అర్హులైన వారందరూ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోప రహిత ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బూత్ లెవెల్ అధికారులకు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లకు శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. జిల్లాలలో ఉన్న పెండింగ్ ఫారంస్ త్వరగా క్లియర్ చేయాలని, అలాగే చనిపోయిన వారు, డూప్లికేట్ ఓటర్లు, చిరునామాలో లేని వారి ఓట్లను నిర్ణీత ఫారం ప్రకారం అన్ని వివరాలు సేకరించుకొని తొలగించాలని ఆయన ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డూప్లికేట్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో విచారణ చేసి లోపాలు లేని ఓటర్ బాబితాను రూపొందించాలని ఆదేశించారు.

వైసీపీ ఏమంటుంది :

సర్ ని దేశంలోని మొత్తం విపక్షం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా దీని మీద వైసీపీ నుంచి ఎలాంటి అభిప్రాయం అయితే వ్యక్తం కాలేదు. వైసీపీ సర్ ప్రక్రియకు అనుకూలమా లేక ప్రతికూలమా అన్నది కూడా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇది అధికారంలో ఉన్న పార్టీలకు ముఖ్యంగా ఎన్ డీయే పార్టీలకే లాభం చేకూర్చేందుకు సాగుతున్న ప్రక్రియ అని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో చూస్తే 2024 ఎన్నికల్లో ఈవీఎంల ప్రభావంతో కూడా తాము ఓటమి చెందానై వైసీపీ నేతలు పలు మార్లు ఆరోపించారు. మరి ఇపుడు సర్ ప్రక్రియను స్వాగతిస్తారా లేక కాదు అంటారా అన్నది రాజకీయంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైసీపీ విషయమే తీసుకుంటే సర్ ప్రక్రియకు ఓకే అంటే ఒకలా కాదు అంటే మరోలా ఏపీ రాజకీయం మారే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోందో.