ఆపరేషన్ సిందూర్‌తో మసూద్ అజార్ కుటుంబం ఖతం.. ఎట్టకేలకు వీడియోతో బయటపడింది..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై ఘోర దాడులు జరిపిన విషయం తెలిసిందే.
By: A.N.Kumar | 16 Sept 2025 4:02 PM ISTజమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై ఘోర దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా జైషే మహ్మద్ సంస్థకు చెందిన అనేక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాజాగా ఈ దాడుల్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించిన విషయాన్ని ఆ సంస్థ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ బహిరంగంగా అంగీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మసూద్ కుటుంబంపై తీవ్ర దెబ్బ
మే 7న భారత ఆర్మీ బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం మర్కజ్ సబాన్‌పై దాడి చేసింది. దీనిని జైషే ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్‌గా వినియోగిస్తారు. అంతేకాదు ఇది మసూద్ అజార్ నివాసంగా కూడా ఉపయోగపడుతున్న భవనం. ఈ దాడిలో అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ముక్కలైపోయారని మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించాడు. భారత సైన్యం రహస్యంగా వారి స్థావరాల్లోకి ప్రవేశించి చేసిన దాడులు తమకు పెద్ద నష్టం కలిగించాయని ఆయన ఒప్పుకోవడం గమనార్హం.
పహల్గాం దాడి – ఆపరేషన్ సిందూర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత ఆర్మీ పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. వీటిలో జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం కూడా ఉంది.
ఉగ్రవాదానికి స్పష్టమైన సమాధానం
"మేము దిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. ఇందుకోసం అన్నింటినీ త్యాగం చేశాం" అని మసూద్ ఇలియాస్ కశ్మీరీ చేసిన వ్యాఖ్యలు, భారత్ చేసిన దాడుల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదానికి భారత్ ఇచ్చిన గట్టి సమాధానం, పాక్ మద్దతుతో నడుస్తున్న ఉగ్రశిబిరాలకు గట్టి హెచ్చరికగా మారింది.
మొత్తానికి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై కఠినమైన ప్రతీకారం తీర్చుకుంది. జైషే మహ్మద్‌కి ఇది మరచిపోలేని దెబ్బగా మిగిలిపోనుంది.
